పెడన కృష్ణాపురానికి చెందిన వీరబాబుతో కొండాలమ్మకు 12 ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ అత్త, కోడళ్ల మధ్య తరచూ గొడవలు జరిగాయి. అత్త రజనీపై కోడలు కొండాలమ్మ కక్ష పెంచుకున్నారు. అత్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించింది.
గత నెల 27న రజనీని కర్రతో తలపై కొట్టింది.. ఆమె పీక పిసికి చంపేందుకు ప్రయత్నించింది. ఆమె అప్పటికీ చనిపోకపోవడంతో చీరను మెడకు బిగించింది. నోరు, ముక్కు నుంచి రక్తం రావడంతో అత్త స్పృహ కోల్పోయింది. వెంటనే తన భర్తకు, బంధువులకు ఫోన్ చేసి చనిపోయినట్లు సమాచారం ఇచ్చింది. హత్యను కవర్ చేసేందుకు.. అత్త కాలుజారి వరండాలో పడిపోయిందని కట్టు కథ అల్లింది. భర్త, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఇంటికి వచ్చిన కుమారుడు, కూతురు తీవ్ర గాయాలతో ఉన్న తల్లిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రజనీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 30న ఆమె ప్రాణాలు కోల్పోయారు. ఆమె కుమారుడు వీరబాబు తన తల్లి ఇంట్లో ప్రమాదవశాత్తు పడటంతో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఆమెకు పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు.