అన్నం ప్లేటుతో నడిరోడ్డుపై కానిస్టేబుల్ ఆందోళన..

0
5

ఇదేం భోజనం.. కుక్కలైనా తింటాయా? 

భద్రతా బలగాలకు మెస్‌లో పెట్టే ఆహారం నాణ్యత గురించి పలువురు సిబ్బంది బయటపెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా, యూపీకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. తమ మెస్‌లో పెట్టే భోజనం నాణ్యత గురించి ఆరోపణలు చేశాడు. ప్లేటుతో పాటు రోడ్డుమీదకు ఆహారం తీసుకొచ్చి అందరికీ చూపిస్తూ తాము తినేది జంతువులు కూడా తినలేవంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

మెస్‌లో పెడుతోన్న ఆహారం జంతువులు కూడా తినలేనంత నాసిరకంగా ఉందంటూ ఓ పోలీస్ కానిస్టేబుల్ నడిరోడ్డుపై ఆందోళనకు దిగాడు. మెస్‌లో పెట్టిన రోటీ, పప్పు‌ను ప్లేటుతో పాటు రోడ్డు మీదకు తీసుకొచ్చి అందరికీ చూపిస్తూ బోరున విలపించాడు. రోడ్డు మధ్యలో డివైడర్ వద్ద కూర్చొని నిరసన తెలియజేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో బుధవారం చోటుచేసుకుంది. అలీగఢ్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే కానిస్టేబుల్ ఫిరోజాబాద్ పోలీస్ లైన్స్‌ పరిధిలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పోలీస్ లైన్స్ పరిధిలో పనిచేసే సిబ్బందికి మెస్‌లోనే భోజనం పెడతారు. అయితే, ఈ మెస్‌లో నాసిరకం భోజనం పెడుతున్నారంటూ బుధవారం మనోజ్ కుమార్ నిరసన చేపట్టాడు.

మెస్‌లో పెట్టిన రొట్టెలు, అన్నం, పప్పు ఒక ప్లేటులో పెట్టుకుని రోడ్డు మీదికి వచ్చాడు. వాటిని స్థానికులకు చూపిస్తూ బోరున విలపించాడు. ఇలాంటి రొట్టెలు కుక్కలు కూడా తినవని మనోజ్ కన్నీరుమున్నీరు అయ్యాడు. దీనిపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులందరికీ పౌష్టికాహారం పెట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అలెవెన్స్‌ను 30 శాతం పెంచినా మెస్ యాజమాన్యం, అధికారులు మాత్రం ఇలాంటి నాసిరకం భోజనం పెడుతున్నారని అతడు వాపోయాడు. రోజుకు 12 గంటలు పనిచేసే తనలాంటి కానిస్టేబుళ్లు ఇలాంటి భోజనం ఎలా తింటారని ప్రశ్నించాడు. ఇలాంటి భోజనం తినలేక ఎన్నో రోజులు పస్తులున్నానని విలపించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here