సత్యదేవుడికి భక్తుడు భారీ కానుక అందజేయనున్నారు. కోటిన్నర వ్యయంతో వజ్ర కిరీటాన్ని అందజేయబోతున్నారు. ప్రత్యేకంగా బంగారం, వజ్రాలతో తయారు చేయించారు.
అన్నవరం సత్యదేవుడికి ఓ భక్తుడు వజ్ర కిరీటాన్ని తయారు చేయించారు. పెద్దాపురంకు లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టే సత్యప్రసాద్ దంపతులు సుమారు ఒకటిన్నర రూ.కోటిన్నర వ్యయంతో వజ్ర కిరీటాన్ని.. 682.230 గ్రాముల బంగారం,114.41 క్యారెట్ల వజ్రాలు (3,764 వజ్రాలు),14.97 క్యారెట్ల కెంపు పచ్చతో చేశారు. ఈ వజ్ర కిరీటాన్ని స్వామివారికి కానుకగా ఇవ్వనున్నారు. ఈ వజ్ర కిరీటాన్ని స్వామి జయంతి సందర్భంగా అలంకరణ చేయనున్నారు
అంతేకాదు మట్టే సత్యప్రసాద్ దేవస్థానంలో రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. రూ. 5 కోట్లతో ప్రసాదం తయారీ భవనం నిర్మించారు. స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ కోసం హారతులను అత్యంత ఆకర్షణీయంగా తయారు చేయించి ఇచ్చారు. ప్రధాన ఆలయం ముందుగోడలకు సుమారు రూ.70 లక్షలతో బంగారు తాపడం చేయించారు. నిత్యకల్యాణ మండపానికి ఏసీ సౌకర్యం పెట్టించారు. సీతారాముల ఆలయానికి ధ్వజస్తంభం, ఇత్తడి తాపడం చేయించారు.
మరోవైపు అన్నవరం సత్యదేవుని 132వ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం గణపతి పూజ, పుణ్యహవచనం, జపాలు, వేదపారాయణ, మండపారాధన, చండీపారాయణ, సూర్యనమస్కారాలు, నవగ్రహ మూల మంత్ర జపాలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. 30న శనివారం స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెల్లవారుజామున 2 గంటలకు సుప్రభాతసేవ, 4 గంటలకు మూలవిరాట్‌కు పంచామృతాభిషేకాలు నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయుష్యహోమం, పూర్ణాహుతి ఉంటుంది. ఉదయం వెండి రథంపై ఊరేగింపు.. రాత్రి గరుడ వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది.