అర్పిత ముఖర్జీ డ్రైవర్ బయటపెట్టిన సంచలన నిజాలు.. 

0
8

ఈడీ అధికారులు నన్నూ విచారించారు: అర్పిత ముఖర్జీ డ్రైవర్ 

నిన్న మొన్నటి వరకూ అర్పిత ముఖర్జీ కొంత మందికే తెలుసు. ఇప్పుడు దేశమంతా ఆమె గురించి మాట్లాడుకుంటోంది. ఇందుకు కారణం పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న ఎస్‌ఎస్‌సీ స్కామ్ వ్యవహారం అంతా ఆమె చుట్టూనే తిరుగుతుండటం. ఆమె ఇంట్లో నాలుగు లగ్జరీ కార్లు మిస్ అవ్వటమూ ఈ కేసులో కీలకంగా మారింది. అయితే…అర్పిత ముఖర్జీ డ్రైవర్ ప్రణబ్ భట్టాచార్య ఈ కార్ల మిస్సింగ్‌పై స్పందించారు. అర్పిత ముఖర్జీ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న కార్లు దాదాపు మూడు నెలలుగా కనిపించటం లేదని వెల్లడించాడు. ఇదే సమయంలో మరో కీలక విషయం కూడా చెప్పాడు. ఆమె కార్లలో హోండా సిటీని మాత్రమే నడిపేందుకు తనకు అనుమతి ఇచ్చేదని, మిగతా కార్లు డ్రైవ్ చేసేందుకు మాత్రం పర్మిషన్ ఇచ్చేది కాదని చెప్పాడు. మరో సంచలన నిజాన్నీ బయటపెట్టాడు. మాజీ మంత్రి పార్థ ఛటర్జీ తరచు అర్పిత ముఖర్జీ
ఇంటికి వచ్చేవాడని చెప్పాడు. “నేను డ్రైవింగ్ డ్యూటీ నుంచి దిగిపోయే సమయానికి, ఆయన ఇంటికి వచ్చే వారు” అని అన్నాడు. ఈడీ అధికారులు తననూ ప్రశ్నించారని స్పష్టం చేశాడు. “ఇల్లు సోదాలు చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నన్ను లోపల కూర్చోమని చెప్పారు. నా ఫోన్ తీసుకుని, అర్పిత ముఖర్జీకి సంబంధించిన వివరాలు అడిగారు” అని చెప్పాడు. 

కార్ల కోసం కొనసాగుతున్న వేట..

పార్థ ఛటర్జీ సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీకి చెందిన నాలుగు విలాసవంతమైన కార్లు కనిపించకుండా పోయాయి. కలకత్తాలోనిటోలిగుంజేలో తొలిసారి ఈడీ అధికారులు అర్పిత ముఖర్జీ ఇంటిని సోదా చేశారు. ఆ సమయంలోనే ఆమెకు నాలుగు లగ్జరీ కార్లున్నాయని ఈడీకి తెలిసింది. ఆడీ A4,హోండా సిటీ, హోండా సీఆర్‌వీ, మెర్సిడెస్‌ బెంజ్ కార్లున్నాయని తేలింది. అయితే ఆమెను అరెస్ట్ చేసినప్పటి నుంచి ఆ కార్లు కనిపించకుండా పోయాయి. ఈడీ అధికారులు ఆమె ఇల్లు ఉన్న ప్రాంతంలోని సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు. అవి ఏమైపోయాయని ఆరా తీస్తున్నారు. అర్పిత ముఖర్జీ ఫ్లాట్‌లోని సీసీటీవి విజువల్స్‌ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ నాలుగు కార్లలో, రెండు కార్లు అర్పిత పేరుపైనే రిజిస్టర్ అయి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇటీవల ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా, రెండు రియల్ ఎస్టేట్‌ కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లు లభించాయి. వీటితో పాటు రూ.28 కోట్ల నగదునీ స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను ఈడీ ఇన్వెస్టిగేటర్లు పరిశీలిస్తున్నారు. 

చినార్ పార్క్‌లో మరో ఫ్లాట్ 

ఈ రెండు రియల్ ఎస్టేట్ కంపెనీల అడ్రెస్‌, అర్పిత ముఖర్జీ ఇంటి అడ్రెస్‌ మ్యాచ్ అవుతున్నాయని వెల్లడించారు. 2017లో రూ.లక్ష పెట్టుబడితో ఈ కంపెనీలు ప్రారంభించినట్టు నిర్ధరించారు. చినార్ పార్క్‌ ఏరియాలో ఉన్న మరో ఇంట్లోనూ ఈడీ సోదాలు కొనసాగించింది. ఇక్కడ కూడా పెద్ద మొత్తంలో నగదు దొరికే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న వారిని కూడా విచారణలో భాగంగా ప్రశ్నిస్తున్నారు. ఈ ఫ్లాట్‌లో ఎలాంటి కార్యకలాపాలు జరిగాయో ఆరా తీస్తున్నారు. డోర్ లాక్ వేసి ఉండటం వల్ల, పగలగొట్టి మరీ లోపలకు వెళ్లారు అధికారులు. అర్పిత ముఖర్జీని విచారిస్తుండగా, చినార్ పార్క్‌లోని ఫ్లాట్‌ గురించి చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ దొరికిన బంగారం విలువ ఎంత అన్నది పూర్తిగా వెల్లడించలేదు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here