ఆగస్టు 15 నుంచి ‘ఫ్యామిలీ డాక్టర్’
ప్రతి నెలా రెండుసార్లు 104 వాహనాలు సందర్శించేలా ప్రణాళిక
గ్రామీణుల చెంతకు మెరుగైన వైద్యం
ఒక వైద్యుడు పీహెచ్సీలో ఉంటే.. మరో వైద్యుడు గ్రామాల బాట
656 మొబైల్ మెడికల్ యూనిట్ లకు తోడుగా మరో 432 కొత్త వాహనాల కొనుగోలుకు చర్యలు
ఆగస్టు 1 నుంచి ట్రయల్ రన్ ప్రారంభించాలని యోచన
సచివాలయాలే కేంద్ర బిందువు
గ్రామ సచివాలయాలు కేంద్రంగా 104 మొబైల్ మెడికల్ యూనిట్ ల ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రజలకు చేరువ చేయనున్నారు.
ప్రస్తుతం ప్రతి గ్రామ సచివాలయానికి నెలలో ఒక రోజు 104 వాహనాలు వెళుతున్నాయి.
ఆ రోజు మధ్యాహ్నం వరకు 104 వైద్యుడు, సిబ్బంది ఓపీలు నిర్వహిస్తున్నారు.
ఆ తర్వాత గృహాలను సందర్శించి, మంచానికి పరిమితమైన వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, పిల్లలకు వైద్యం చేస్తున్నారు.
ఇలా 656 ఎంఎంయూలు రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో అదనంగా అవసరమయ్యే 432 కొత్త 104 వాహనాలు కొనుగోలుకు వైద్య శాఖ చర్యలు తీసుకుంటోంది.
పీహెచ్సీ వైద్యులతో మ్యాపింగ్
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బందిని సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా పీహెచ్‌సీల్లో పనిచేసే ఇద్దరు వైద్యులకు ఆ పరిధిలో ఉన్న సచివాలయాలను కేటాయిస్తారు.
ఈ క్రమంలో ఒక వైద్యుడు పీహెచ్సీలో ఉంటే, మరో వైద్యుడు 104 వాహనంతో గ్రామాలకు వెళ్లి తనకు కేటాయించిన సచివాలయ పరిధిలోని కుటుంబాలకు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. ఇలా రోజు మార్చి రోజు ఒక వైద్యుడు పీహెచ్సీలో మరో వైద్యుడు 104 వాహనం ద్వారా గ్రామాల్లో వైద్య సేవలు అందిస్తారు.
వైద్యుడితో పాటు, సంబంధిత వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లోని మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ), సచివాలయ ఏఎన్ఎం, ఆశ వర్కర్లు ప్రజలకు గ్రామాల్లోనే 104 ఎంఎంయూ ద్వారా వైద్య సేవలు అందిస్తారు
104 వాహనం ఏ రోజు ఏ గ్రామానికి వస్తుంది? తమ సచివాలయానికి కేటాయించిన వైద్యుడు, అతని ఫోన్ నంబర్, ఇతర వివరాలతో కూడిన విలేజ్ క్లినిక్/సచివాలయంలో ప్రదర్శిస్తారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సమగ్ర వివరాలతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తారు.
ఎవరికైనా మెరుగైన వైద్యం అవసరమైనట్లు వైద్యుడు భావిస్తే, దగ్గరలోని పెద్ద ఆస్పత్రి, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. ఏఎన్ఎం/ఎంఎల్‌హెచ్‌పీ ఆ రోగిని 108 ద్వారా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడం వంటి అంశాలను సమన్వయం చేస్తారు.
తొలుత ఒక సందర్శనతో ప్రారంభం..
గ్రామాల్లో నెలలో రెండు సందర్శనలు చేపట్టడానికి వీలుగా 432 ఎంఎంయూలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే కొత్త వాహనాలు అందుబాటులోకి వచ్చే వరకు ఒక సందర్శన ద్వారానే ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.