ఓ ఇద్దరు యువకులు రోజుకో కొత్త బైక్ తో ఆంధ్రా బోర్డర్ దాటుతున్నారు. కొన్నిరోజులు లైట్ తీసుకున్న పోలీసులకు.. ఓ రోజు డౌట్ వచ్చింది. వాళ్లిద్దరిపై నిఘా ఉంచారు. ఇంకేముంది ఇది కూడా బీదర్ లో ఇసుక చల్లేలాంటి సీనే అని అర్ధమైంది.
సాధారణంగా యువకులకు బైకులంటే పిచ్చి. కొత్తకొత్త బైక్ లపై తిరగాలని కోరుకుంటారు. అందుకే తెలిసిన వారు ఏదైనా కొత్త మోడల్ బైక్ కొంటే.. వెంటనే ఓ రైడేసేస్తారు. అలాంటి ఓ ఇద్దరు యువకులు రోజుకో కొత్త బైక్ తో ఆంధ్రా బోర్డర్ దాటుతున్నారు. కొన్నిరోజులు లైట్ తీసుకున్న పోలీసులకు.. ఓ రోజు డౌట్ వచ్చింది. వాళ్లిద్దరిపై నిఘా ఉంచారు. ఇంకేముంది ఇది కూడా బీదర్ లో ఇసుక చల్లేలాంటి సీనే అని అర్ధమైంది. ఇద్దర్నీ తీసుకెళ్లి.. జైల్లో ఇసుక చల్లే పనికి పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన మాచర్ల నవీన్ బాబు, అదే ప్రాంతంలోని పాతూరికి చెందిన చల్లా భవానీ శంకర్ స్నేహితులు. ఇద్దరికీ బైకులంటే ఇష్టం. అందులోనూ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకుంటే పిచ్చి.
అలా ఇద్దరూ రోజుకో కొత్త ఎన్ ఫీల్డ్ బైక్ పై ఆంధ్రా బోర్డర్ దాటి.. తెలంగాణ (Telangana) కు వెళ్తున్నారు. ఐతే చాలా రోజుల పాటు పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఓ రోజు ఎక్కడో తేడా కొడుతుందని నిఘా ఉంచారు. అసలు నిజం తెలిసి వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. చిలకలూరిపేట పట్టణంలో ని సుబ్బయ్యతోటకు చెందిన కనమర్లపూడి పవన్ అనే వ్యక్తి గత నెల 29వ తేదీన రాత్రి 10.00 గంటల సమయంలో తన ఇంటిముందు పెట్టిన తన AP39HU9600 నెంబర్ గల రాయల్ ఎన్ ఫీల్డ్బైక్ ను పార్క్ చేశారు. అలాగే అదే ఇంట్లోని పై పోర్షనులో అద్దెకు ఉంటున్న కొమ్మనబోయిన నాగ అనిల్ కు చెందిన AP39JX2468 రాయల్ ఎన్ ఫీల్డ్ ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. దీంతో ఇద్దరూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ రాజేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు విచారణలో ముద్దాయిలు మాచర్ల నవీన్ బాబు, చల్లా భవాని శంకర్ రెండవ ఆట సినిమాలకి వెళ్ళి , సినిమా మధ్యలో లేచి బయటకు వచ్చేసి పట్టణంలో తిరుగుతూ అనుకూలంగా ఉన్న చోట చూసుకొని రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిళ్ళను మాత్రమే హ్యాండిల్ లాక్ లను విరగ్గొట్టి దొంగతనం చేస్తుంటారని తేలింది. ఆ బైకులను మాచర్ల తీసుకెళ్లి.. అక్కడి నుంచి తెలంగాణ వెళ్లి(ఏపి క్రైమ్ న్యూస్) విక్రయిస్తుంటారు. పక్కా సమాచారంతో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద రూ.11 లక్షలు విలువైన రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులను స్వాధీనం చేసుకున్నారు.