ఇంటింటా మువ్వన్నెల జెండా అవగాహన కార్యక్రమం…

0
7
  ప్రజాస్వామ్యమే రాజ్యమేలేలా అహర్నిశలు కృషిచేసిన మహనీయుల స్పూర్తితో సమాజ అభివృద్ధి వైపు నేటి యువత అడుగులు వేయాలని రాష్ట్ర" సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున" చెప్పారు.

  • ఇంటింటా మువ్వన్నెల జెండా అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం బాపట్లలో “2కె వాక్” కార్యక్రమాన్ని యంత్రాంగం నిర్వహించింది. స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల వద్ద మంత్రి మేరుగు నాగార్జున పచ్చజెండా ఊపి 2కె నడక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య చిత్రపటానికి మంత్రి, ఉప సభాపతి కోనా రఘపతి, ఎమ్.ఎల్.సి పోతుల సునీత, జిల్లా కలెక్టరు విజయకృష్ణన్, జిల్లా ఎస్.పి వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టరు డా.కె.శ్రీనివాసులు, తదితరులు పుష్పాలతో ఘనంగా నివాళులర్పించారు. పాఠశాల ఆవరణలోనే జాతీయ జెండాను మంత్రి నాగార్జున ఎగురవేశారు. ఆజాదికా అమృత్ మహోత్సవంలో భాగంగా అతిధులంతా కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. తదనంతరం గాంధీజీ, అంబేద్కర్, పింగళి వెంకయ్యల విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. విద్యార్థులతో పాటు అతిధులంతా మువ్వన్నెల జెండా చేతబూని 2 కి.మీ. వరకు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

  • స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో చిన్నారులు నిర్వహించిన ప్రదర్శన ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్.సి.సి క్యాడెట్లు, విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ మనమంతా భారతీయులమంటూ కదం తొక్కారు. అంబేద్కర్ విగ్రహ కూడలిలో ఏర్పాటుచేసిన సభావేదికపై విద్యార్థులనుద్దేశించి అతిధులు స్పూర్తిదాయక ప్రసంగాలు చేశారు.

  • కులమతాలు వర్గ వైశమ్యాలకు అతీతంగా బాపట్ల జిల్లా అభివృద్ధిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. సమానత్వం కోసం ఆనాటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలన్నారు. 75 వసంతాల తరువాత స్వతంత్ర భారతదేశం ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచిందన్నారు. కులాలు, మతాలు దేశంలో అనేకం ఉన్నప్పటికి అతిపెద్ద రాజ్యంగ వ్యవస్థగా భారత్ అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు.
  • భారతీయుల కలయికకు జాతీయ జెండా ముంగుర్తుగా నిలిచిందన్నారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతిని ఇలా జరుపుకోవడం శుభపరిణామం అన్నారు. రాజ్యంగ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలిస్తున్నాయన్నారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సమానత్వానికి సూచికగా ఆయన అభివర్ణించారు. అందరికి సమానహక్కులు కల్పిస్తూ డా.బి.ఆర్.అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రచించారని ఆయన తెలిపారు. ఆరాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ద్వారానే నేడు మంత్రిగా మీముందు ఉన్నానని ఆయన మననం చేసుకున్నారు.
  • మది నిండా జాతీయ భావాన్ని నింపుకుని, దేశపురోభివృద్ధిలో మనమంతా కలిసి పయనించాలని ఉపసభాపతి కోనా రఘపతి కోరారు. భారతదేశంలో జన్మించడం గొప్పగా భావించాలని ఆయన సూచించారు. స్వాతంత్య్ర ఫలాలను గుర్తుచేసుకుంటూ ప్రతి గ్రామంలోను, ప్రతి పాఠశాలలపై జాతీయ జెండా రెపరెపలాడాలని ఆయన తెలిపారు. కుల, మత, రాజకీయ బేధాలను పక్కన పెట్టి జాతీయ జెండా గొడుగు కిందకు ప్రజలంతా కలిసిరావాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్యమకారుల స్పూర్తితో విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.
  • ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని జిల్లా కలెక్టరు విజయకృష్ణన్ తెలిపారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశాన్ని ప్రజలంతా కలిసి చక్కగా నడిపించుకోవడం అభినందనీయమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి సమానహక్కులు ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అభివృద్ధిలో ముందుకుసాగాలని ఆమె కోరారు.
  • భిన్నత్వంలో ఏకత్వంతో ప్రజలంతా జాతీయ జెండా నీడలో సుభిక్షంగా జీవిస్తున్నారని శాసనమండలి సభ్యురాలు పోతుల సునీత చెప్పారు. మంచి సంస్కృతి సంప్రదాయాలతో భారతదేశం ఆనాటి నుంచి నేటి వరకు ఆదర్శంగా నిలిచిందన్నారు. స్వాతంత్య్రం వచ్చేలా కృషి చేసిన యోధులను స్పూర్తిగా తీసుకొని విద్యార్థులంతా సమాజసేవ వైపు అడుగులు వేయాలన్నారు.
  • కార్యక్రమంలో ఆర్.డి.ఓ జి.రవీందర్, డి.ఇ.ఓ రామారావు, తహశీల్దార్ కవిత, జిల్లా అధికారులు, అనధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here