ఇంటి పేరుంటే సమస్యలే..

0
3

పిల్లల ఇంటి పేరు నిర్ణయించే హక్కు తల్లికే ఉంది..!

పిల్లల ఇంటి పేరుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లల ఇంటి పేరు విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు తల్లులకే ఉంటుందని స్పష్టం చేసింది. తల్లి మళ్లీ వివాహం చేసుకున్న తర్వాత పిల్లల సహజ తండ్రి ఇంటి పేరునే పెట్టుకుంటే చాలా సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇంటి పేరును కేవలం కుటుంబం, సంస్కృతికి ముడిపెట్టే చూడకూడదని పిల్లల వాస్తవిక జీవితాన్ని, అతని గుర్తింపుగా కూడా చూడాలని వెల్లడించింది.

పిల్లల ఇంటి పేర్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తల్లులకు తమ పిల్లల ఇంటి పేర్లను నిర్ణయించుకునే హక్కు ఉందని స్పష్టం చేసింది. సహజ సంరక్షకురాలిగా ఉన్న తల్లికి బిడ్డను దత్తతనిచ్చే హక్కు కూడా ఉందని న్యాయమూర్తులు దినేష్ మహేశ్వరి, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఇంటి పేరు వంశాన్ని సూచించడమే కాదు.. చరిత్ర, సంస్కృతికి సంబంధించినదిగా మాత్రమే అర్థం చేసుకోకూడదని, నిర్ధిష్ట వాతావరణంలో పిల్లల కోసం అనే భావనతో పాటు సామాజిక వాస్తవికతకు సంబంధించి అది పోషించే పాత్రను కూడా చూడాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఏపీ హైకోర్టు తీర్పుపై సవాల్…
ఇంటి పేరు కుటుంబాన్ని సృష్టించడానికి, నిలబెట్టడానికి, ప్రదర్శించడానికి ఒక మోడ్‌గా ఉద్భవించిందని కోర్టు పేర్కొంది. తన బిడ్డ ఇంటిపేరుకు సంబంధించి ఒక మహిళ, ఆమె అత్తమామల మధ్య తలెత్తిన వివాదంపై నిర్ణయం తీసుకునే సందర్భంంలో అత్యున్నత న్యాయస్థానం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. 2014లో జనవరి 24న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఓ మహిళకు 2006లో భర్త చనిపోయాడు. అప్పటికే ఆమెకు రెండున్నరేళ్ల వయస్సున్న బాబు ఉన్నాడు. ఆ మహిళ 2007లో మరో పెళ్లి చేసుకుంది. బాబు ఆమెతోనే ఉంటున్నాడు

అయితే బాబు తల్లితోనే ఉన్నప్పటికీ అతడి ఇంటిపేరుగా తమ ఇంటి పేరే వాడుకోవాలని, తండ్రి పేరు స్థానంలో తన కొడుకు పేరే ఉండాలని కోరుతూ మరణించిన భర్త తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఏపీ హైకోర్టు 2014లో వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం.. బాబుకు మరణించిన తండ్రి ఇంటిపేరే ఉండటంతోపాటు, తండ్రి పేరు స్థానంలో కూడా అతడి పేరు పెట్టుకోవాలని సూచించింది. అవసరమనుకుంటే మహిళ తన రెండో భర్త పేరును బాబుకు దత్తత తండ్రిగా పెట్టుకోవచ్చని చెప్పింది.

తల్లికి దత్తత ఇచ్చే హక్కు కూడా …
అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆ మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అప్పీలు చేసుకున్న మహిళకు అనుకూలంగా వ్యాఖ్యానించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సరికాదని చెప్పింది. తల్లి ఇంకో వివాహం చేసుకున్న తర్వాత బాబు సహజ తండ్రి పేరునే ఉంచుకోవాల్సి వస్తే అనేక మానసిక సమస్యలను, ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడింది. అందుకే తల్లే పిల్లల ఇంటిపేరును నిర్ణయించుకోవచ్చని సూచించింది. అలాగే పిల్లల్ని దత్తత ఇచ్చే హక్కు కూడా తల్లికి ఉంటుందని చెప్పింది.

“బాబు పేరులో వ్యత్యాసం దత్తత వాస్తవాన్ని నిరంతరం గుర్తు చేస్తుంది. బాబుకి, అతని తల్లిదండ్రుల మధ్య మృదువైన, సహజమైన సంబంధానికి ఆటంకం కలిగించే అనవసరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. కాబట్టి తల్లి అప్పీలులో అసాధారణం ఏమీ కనిపించడం లేదు.” అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఆ మహిళ తన కొడుకును రెండో భర్తకు చట్టప్రకారం దత్తత కూడా ఇచ్చింది. దాని ప్రకారం అతడికే తండ్రిగా అన్ని హక్కులు ఉంటాయని, ఇంట్లో పుట్టిన వారికి ఏ హక్కులుంటాయో అన్ని హక్కులు దత్తత ద్వారా వచ్చిన వారికి ఉంటాయని కోర్టు పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here