ఇస్రో ప్రయోగంపై సందిగ్ధం ,టెర్మినల్ దశలో సమాచారం నిలిచిపోయింది..

0
5

పీఎస్ఎల్వీ ద్వారా ఇస్రో ఇప్పటిదాకా చిన్న, మధ్యస్థ, ఓ మోస్తరు బరువైన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపుతూ ఉంది. ఈ భారీ నౌకను తయారుచేయడానికి 600 మంది 70 రోజుల పాటు శ్రమించాల్సి వచ్చేది. దీనికయ్యే ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో చిన్న చిన్న శాటిలైట్స్‌ను పంపేందుకు వీలుగా ఓ బుల్లి రాకెట్‌ను రూపొందించింది. ఈ రాకెట్‌ను షార్ కేంద్రం నుంచి ఆదివారం ఉదయం ప్రయోగించారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కొత్తగా అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ వాహకనౌక ను సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ (Shatish Dhawan Space Centre) నుంచి ఆదివారం ఉదయం నింగిలోకి పంపింది. అయితే, ఈ ప్రయోగంపై సందిగ్ధత నెలకుంది. షార్ మొదటి ప్రయోగవేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు బయలుదేరిన రాకెట్ 13.2 నిమిషాల్లో మూడు దశలను విజయవంతంగా పూర్తిచేసింది. అయితే, నాలుగో దశలో సాంకేతిక సమస్యలతో రాకెట్ నుంచి భూకేంద్రానికి సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలోకి చేరాయో? లేదా? ఇస్రో శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ.. మూడు దశల విజయవంతమయ్యాయని, రాకెట్ గమనాన్ని విశ్లేషిస్తున్నామని తెలిపారు. ‘‘ఎస్ఎస్ఎల్వీ నౌక ప్రయోగం పూర్తయ్యింది.. నిర్దేశించినట్టే అన్ని దశలూ పూర్తయ్యాయి… టెర్మినల్ దశలో సమాచారం నిలిచిపోయింది.. మిషన్‌ తుది ఫలితాన్ని నిర్ధారించడానికి మేము సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం.. కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయా? లేదా? పరిశీలిస్తున్నాం.. ప్రయోగ పురోగతిపై వీలైనంత త్వరగా సమాచారం ఇస్తాం’’ అని సోమనాథ్ అన్నారు.

నింగిలోకి పంపిన భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్‌-02 బరువు 140 కిలోలు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో సాయపడేలా దీనిని రూపొందించారు. అలాగే, 75 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 750 మంది విద్యార్థులు రూపొందించిన ఆజాదీశాట్‌‌ బరువు 8 కిలోలు. 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం, ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలకు గుర్తుగా దీన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహం జీవితకాలం ఆరు నెలలు. ఇందులో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాడిన జాతీయ గీతం రికార్డ్‌ వెర్షన్‌ను పొందుపర్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here