అధికార తృణమూల్ కాంగ్రెస్ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలి ఇంట్లో గుట్టలుగా పడివున్న కరెన్సీ నోట్లను చూసి ఈడీ అధికారులు విస్తుపోయారు..
మంత్రి సన్నిహితురాలైన అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈడీ నిర్వహించిన సోదాల్లో ఏకంగా రూ. 20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు..
పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ (WBSSC), ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డులో అవకతవకలకు సంబంధించిన మోసం కేసులో ఈడీ అధికారులు అర్పిత ఇంటిపై దాడి చేశారు..
ఈ సందర్భంగా పట్టుబడిన సొమ్మును ఎస్ఎస్సీ కుంభకోణంలో కూడబెట్టినదిగా అనుమానిస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు..
పట్టుబడిన సొమ్మును లెక్కించేందుకు బ్యాంకు అధికారుల సాయం తీసుకున్నామని, క్యాష్ కౌంటింగ్ మెషీన్లను ఉపయోగించి నోట్లను లెక్కించినట్టు చెప్పారు..
ఛటర్జీతో పాటు విద్యాశాఖ సహాయ మంత్రి పరేష్ సి అధికారి, ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య తదితరుల నివాసాలపైనా ఈడీ దాడులు నిర్వహించింది..
ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా ఉన్న పార్థ ఛటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో అక్రమ నియామకాలు జరిగినట్టు అధికారులు ఆరోపించారు..
ఈ దాడులను అధికార తృణమూల్ కాంగ్రెస్ ఖండించింది..
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు కేంద్రంలోని బీజేపీ చేసిన కుట్రగా అభివర్ణించింది