ఈనెల 30వ తేదీలోగా న్యాయ విచారణ జరిపి నివేదిక అందజేయాలి

0
2

-ఎస్సీ కమిషన్ డైరెక్టర్ జి. సునీల్ కుమార్

శనివారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ ఎస్ ఆర్ శంకరన్ విసి హాల్లో జాతీయ ఎస్. సి.కమిషన్ డైరెక్టర్ జిల్లా కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జిల్లా పోలీసు అధికారి సిహెచ్ విజయ రావు, సంయుక్త కలెక్టర్ ఆర్ కూర్మానాధ్ లతో కలిసి గత జూన్ మాసంలో జరిగిన ఉదయగిరి నారాయణ మృతి పై సమీక్షించారు..

ఈ సందర్భంగా ఎస్సీ కమిషన్ డైరెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆదేశాల మేరకు జిల్లాకు వచ్చి నెల్లూరు రూరల్ మండలం కందమూరులో ఉదయగిరి పద్మను విచారించడం జరిగిందని అలాగే పొదలకూరు పోలీస్ స్టేషన్ మృతి చెందిన ప్రదేశము పరిశీలించడం జరిగిందన్నారు. ఈనెల 30వ తేదీలోగా ఈ కేసు విషయమై న్యాయబద్ధంగా లోతుగా విచారణ జరిపి ఎటువంటి ఆరోపణలకు తావివ్వకుండా ఈ నెల 30 వ తేదీలోగా నివేదిక అందజేయాలని పోలీసు అధికారులకు సూచించారు.

జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ ఈ కేసును ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రిజిస్టర్ చేయడం జరిగిందని, బాధితులకు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా 80 శాతం నష్టపరిహారం విడుదల చేయడంతో పాటు బాధితురాలికి అన్ని విధాల సాయం అందించి ఆదుకోవడం జరిగిందన్నారు. వ్యవసాయ భూమి మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వారి పిల్లలకు గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేవరకు ఉచితంగా విద్యను అందిస్తామన్నారు. మూడు నెలలపాటు ఉచితంగా బియ్యము పప్పు తదితర సరుకులు, ఇంటి స్థలం,ఇల్లు మంజూరు చేశామన్నారు. నాలుగో తరగతి ఉద్యోగం లో నియమించడం జరిగిందన్నారు. ఎస్సీ కమిషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి తెలియజేస్తూ చర్యలు నివేదికను పంపడం జరిగిందన్నారు. జిల్లాలో ఎస్సీ ఎస్టీల చట్టం పట్ల ప్రభుత్వం పూర్తిగా భరోసానిస్తోందన్నారు. చట్టం పక్కగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందని ప్రభుత్వ సంక్షేమ శాఖలు చట్టంపై అవగాహనతో సజావుగా అమలు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో అణగారిన వర్గాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతినెల 2 పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు.

జిల్లా పోలీసు అధికారి సిహెచ్ విజయరావు మాట్లాడుతూ సంఘటన జరిగిన ప్రాంతం తో పాటు అన్ని ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించామని నూటికి నూరు శాతం న్యాయబద్ధంగా విచారణ జరిపామన్నారు. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పక్కాగా అమలు జరిపి బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఫోరెన్సిక్ సైన్సు ల్యాబ్ నివేదిక అందాల్సి ఉందని అంతవరకు కొంత సమయం ఇవ్వాలని ఆ నివేదిక అందిన తర్వాత చార్జి షీట్ కోర్టులో దాఖలు పరుస్తామని చెప్పారు. కమిషన్ ఆదేశాలు మేరకు నివేదిక అందజేస్తామని న్యాయపరమైన విధానాలను అన్నింటిని అనుసరిస్తామని చెప్పారు.

అనంతరం బాధితురాలు ఉదయగిరి పద్మను పిలిచి ఆమెకు డైరెక్టర్ నెల్లూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నియమిస్తూ జారీచేసిన ఉద్యోగ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఆమెతో మాట్లాడుతూ ఆమెకు 4,12,500 రూపాయలు ఈనెల 3 వ తేదీన ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశారని, 5వేల రూపాయల పింఛను మంజూరు చేయడం జరిగిందని, ఇంటి కోసం మూడు సెంట్లు స్థలము మంజూరు చేశారని, ఇంకా 4,12,500 రూపాయలు జిల్లా పోలీసు అధికారి చార్జి షీట్ వేశాక ఇవ్వడం జరుగుతుందని, ఎస్పీ విచారణ నివేదిక త్వరలో ఇస్తారని వారి నివేదికతో పాటు తాను తయారుచేసిన నివేదికను ఎస్సీ కమిషన్ చైర్మన్ కు అందజేయడం జరుగుతుందని, ఆ రెండు నివేదికల ఆధారంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ తగిన నిర్ణయం తీసుకుంటారని ఆమెకు చెప్పారు. బాధితురాలిని అన్ని విధాల ఆదుకున్నందుకు ఈ సందర్భంగా డైరెక్టర్ కలెక్టర్ ను అభినందించారు. ఎస్.పి. న్యాయ సమ్మతంగా నివేదికను అందజేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. పిల్లలను గ్రాడ్యుయేషన్ వరకు ఉచితంగా చదివించడం జరుగుతుందని, ఏ కళాశాలలో చేర్పించమంటే అక్కడ చేర్చడం జరుగుతుందని, ముగ్గురు పిల్లలను బాగా చదివించాలని డైరెక్టర్ ఆమెకు చెప్పారు.

ఈ సమావేశంలో ఎస్సీ కమిషన్ కన్సల్టెంట్ రామస్వామి డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, ఆర్డీవో కొండయ్య డిఎస్పిలు హరినాథ్ రెడ్డి కోటారెడ్డి తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here