ఈసారి అధికారం బీజేపీదే..

0
7

ఆంధ్రా సెటిలర్లు మా వైపే.. టీఆర్ఎస్‌కి 10-15సీట్లు కూడా కష్టమే

 వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈసారి తెలంగాణలో 12 ఎంపీ సీట్లు కూడా తమ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయినట్లేనని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 10-15 అసెంబ్లీ సీట్లు రావడం కూడా కష్టమేనని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. ఈ విషయం తెలియకే ఈటల రాజేందర్గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారని స్పష్టం చేశారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలన్నది కూడా అధిష్ఠానమే నిర్ణయిస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని ఉచితం చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణలో బీజేపీ వేగంగా పుంజుకుంటోందని.. ఈ సారి 12 లోక్‌సభ స్థానాలు దక్కించుకోవడం ఖాయమని సంజయ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలోనూ ఈసారి బీజేపీదే విజయమని, పాతబస్తీ నుంచి ఎంఐఎంని తరిమి కొడతామని పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్న బండి సంజయ్.. మంచి ముహూర్తం కోసమే ఆయన వేచి చూస్తున్నారని తెలిపారు. కేసీఆర్ రూ.లక్ష కోట్ల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ యుద్ధం చేయబోతోందని తెలిపారు. వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో త్వరలోనే ఓ బృందం ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, వరదలకు ప్రాజెక్టు మునకపై ఫిర్యాదు చేస్తుందని తెలిపారు. కాళేశ్వరం ముంపు నుంచి జనం, మీడియా దృష్టిని మరల్చేందుకే భద్రాచలం ముంపు, పోలవరం విలీన గ్రామాల అంశాన్ని టీఆర్ఎస్ తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.

ఆంధ్రా సెటిలర్లను కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా వేధిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దీంతో వారంతా వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చేనేత బీమా అమలు కోరుతూ ఆగస్టు 7న బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 17ని తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బండి సంజయ్ తెలిపారు.

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడ బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్‌తో భేటీ అయ్యారంటూ వస్తున్న వార్తలను బండి సంజయ్ ఖండించారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారమని మండిపడ్డారు. టీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యే దుస్థితి బీజేపీకి లేదని.. తెలంగాణలో ఒంటరిగానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అప్పుల బాధ నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తామన్నారు. కేసీఆర్ రాజకీయాల్లో ఔట్‌డేటెడ్ అయిపోయారని.. ఆయన రాష్ట్రానికి చేసిన సేవలు ఇక చాలంటూ ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు వారి రాజకీయ భవిష్యత్ కోసం బయటకు రావాలని చూస్తున్నారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here