జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాటం సాగిస్తోన్న సైన్యం.. శనివారం ఓ ముష్కరుణ్ని మట్టుబెట్టింది. ఈ క్రమంలో అలెక్స్ అనే జాాగిలాన్ని కోల్పోయింది. ఉగ్రవాది నక్కి ఉన్న భవనంలోకి శనివారం అలెక్స్, బాలాజీ అనే రెండు జాగిలాలు ప్రవేశించాయి. మొదటి గదిని దాటి అలెక్స్ రెండో గదిలోకి వెళ్లగా.. ముష్కరుడు జరిపిన కాల్పుల్లో జాగిలం శరీరంలో నుంచి మూడు తూటాలు దూసుకెళ్లాయి. దీంతో అది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత జవాన్లు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి. కానీ ఉగ్రవాదిని మట్టుబెట్టే క్రమంలో శిక్షణ పొందిన అలెక్స్ అనే జాగిలాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఉగ్రవాది నక్కి ఉన్న ప్రదేశాన్ని గుర్తించడానికి వెళ్లిన అలెక్స్‌పై ముష్కరుడు కాల్పులు జరిపాడు. దీంతో అది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అలెక్స్‌కు పోస్టుమార్టం నిర్వహించగా.. దాని శరీరంలో 10కిపైగా గాయాలు ఉన్నాయని.. తుంటి ఎముక విరిగిపోయిందని తేలింది. అలెక్స్ తలలో మూడు బుల్లెట్లను గుర్తించారు. కిలో ఫోర్స్ కమాండర్ చేతుల మీదుగా అలెక్స్‌కు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు మట్టుబెట్టిన ఉగ్రవాదిని అఖ్తర్ హుస్సేన్ భట్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు, ఓ పోలీసుకు గాయాలయ్యాయి. ఐదు గంటలపాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో బెల్జియన్ మలినోయిస్ జాతికి చెందిన అలెక్స్ అనే శునకం కూడా ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. అలెక్స్ మరణంతో దాని బాగోగులు చూసుకుంటున్న డాగ్ మాస్టర్ కన్నీటి పర్యంతమయ్యాడు.