ఉచిత విద్యుత్‌పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

0
4

ఉచిత విద్యుత్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దంటూ ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. రైతులు కరెంట్ బిల్లుల కోసం ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాపై సంపూర్ణ హక్కు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందని ఆయన వివరించారు. ఈ మేరకు ఉచిత విద్యుత్ అమలుపై విద్యుత్ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.

రైతులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పథకం, వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత విద్యుత్ అమలుపై ఆయన అధికారులతో మాట్లాడారు. వ్యవసయానికి నెలవారీ విద్యుత్ బిల్లులు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. రైతుల ఖాతాల నుంచి నేరుగా డిస్కంలకు బిల్లులు చెల్లించడం ద్వారా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం రైతే డిమాండ్ చేసే హక్కు లభిస్తుందని మంత్రి చెప్పారు. విద్యుత్ సంస్థలకు వివిధ కారణాల వల్ల వచ్చే నష్టాలను రైతులపైకి నెట్టేయకుండా ఈ విధానంతో నిరోధించొచ్చని ఆయన వివరించారు.

ఒక్కో రైతుకు ఎన్నెన్ని విద్యుత్ కనెక్షన్లు ఉండాలనే అంశంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. అనధికార, అధిక లోడ్ కనెక్షన్లు కూడా క్రమబద్ధీకరిస్తామని పెద్దిరెడ్డి అన్నారు. కౌలు రైతులకు కూడా ఈ విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తవని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన నగదు బదిలీ పథకం విజయవంతమైందని.. మీటర్లు బిగించడం వలన 33.75 మిలియన యూనిట్ల విద్యుత్ ఆదా అయిందని పెద్దిరెడ్డి చెప్పారు. మీటర్ల ఏర్పాటు, నగదు బదిలీ పథకానికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా 97 శాతం రైతులు అంగీకార పత్రాలను అందజేశారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here