జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్ర ప్రదేశ్ గా మార్చేశారని కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. కందుకూరు లోని 12వ వార్డు పోతురాజుమిట్ట ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలపై కరపత్రాలు పంపిణీ చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తానని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి, ప్రస్తుతం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. ఏటేటా మద్యం వ్యాపారాన్ని పెంచుకుంటూ, దేశంలో ఎక్కడా లేనివిధంగా జే బ్రాండ్లతో వేలకోట్లు వెనకేసుకుంటున్నారని అన్నారు. ఆ పిచ్చి బ్రాండ్లు తాగి సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని, అయినా సరే తనకు ఆదాయమే ముఖ్యమని జగన్ భావిస్తున్నారని నాగేశ్వరరావు మండిపడ్డారు. తాజాగా బార్ల వేలంలోనూ వైసీపీ నాయకులు సిండికేట్ గా మారి కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఇంకా అనేక పథకాల విషయంలోనూ జగన్ మాటతప్పి ప్రజలను మోసం చేశాడని, రాబోయే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాగేశ్వరావు అన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి సహకరించాలని నాగేశ్వరరావు కోరారు. అంతకుముందు పోతురాజు స్వామికి నాగేశ్వరరావు పూజలు చేసి బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డు అధ్యక్షుడు మంగపాటి శ్రీను ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వార్డు నాయకులు కోటపూరి శ్రీను, షేక్ బాబు, సయ్యద్ బాబు, సయ్యద్ బాషా, షేక్ సలాం, తన్నీరు రాజశేఖర్, కిష్టయ్య, శ్రీను, పార్టీ నాయకులు నాదెండ్ల వెంకట సుబ్బారావు, నాదెండ్ల రమణయ్య, చిలకపాటి మధు, గోచిపాతల మోషే, షేక్ సలాం, ముచ్చు వేణు, వడ్డెళ్ల రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.