ఉపరాష్ట్రపతిగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నారు వెంకయ్యనాయుడు . ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు
ఉపరాష్ట్రపతిగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నారు వెంకయ్యనాయుడు . ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇదిలా ఉంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన హామీల అమలుపై వెంకయ్య నాయుడు మళ్లీ ఆరా తీశారు. సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణల్లో చేపట్టిన కార్యక్రమాల పురోగతిపై సమీక్ష సమీక్షించారు. హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమాలు జరుగుతున్న, ప్రతిపాదిత ప్రాంతాలకు అధికారులు వ్యక్తిగతంగా వెళ్లడం ద్వారానే పనుల్లో వేగం పుంజుకుంటుందన్నారు. కాగా ఈ కార్యక్రమాల పురోగతిని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ఉపరాష్ట్రపతికి వివరించారు.
ఈ సందర్భంగా కాకినాడ సీ–ఫ్రంట్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నెల్లూరు పులికాట్, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్, నేలపట్టు, కొత్త కోడూరు, మైపాడు, రామతీర్థం ఇస్కపల్లి ప్రాజెక్టుతో పాటుగా కోస్టల్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్, గుంటూరు, అమరావతి నగరాల్లో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం ఆలయాల అభివృద్ధి, నెల్లూరులోని వేదగిరి నరసింహస్వామి దేవాలయం, అరకు–విశాఖ విస్టాడోమ్ (రైల్వే) ప్రాజెక్టు, తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి, పుట్టపర్తిలో సౌండ్ లైట్ షో పనుల వివరాలను కేంద్రమంత్రి వెంకయ్యకు వివరించారు. అదేవిధంగా ఉడాన్ పథకంలో భాగంగా విశాఖ–రాజమండ్రి, హైదరాబాద్–విద్యానగర్ (హంపి) రూట్ల పురోగతిని వివరించారు. వీలైనంత త్వరగా వీటిని పూర్తిచేయాలని కేంద్రమంత్రికి ఉపరాష్ట్రపతి సూచించారు.