ఒకే అభ్యర్థి వైపు రెండు పార్టీల చూపు..!

0
5
Palle_Ravi_Kumar

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో ఉండి.. మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి.. తాజాగా పార్టీ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో అన్ని పార్టీలు మునుగోడుపై పాగా వెయ్యాలని ప్లాన్ చేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారం నేపథ్యంలో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మునుగోడు సీటుపై కన్నేశాయి. అయితే.. ఇక్కడ ఈ రెండు పార్టీల తరపున బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరనేది కీలకంగా మారింది.ఈ విషయంపైనే మునుగోడులో జోరుగా చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నేతపై ఆశలు పెట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. చురుకైన పాత్ర పోషించి.. కేసీఆర్ కు బాగా దగ్గరయ్యారు. ఉద్యమంలోనే కాదు.. స్వరాష్ట్రం సాధించుకున్నాక కూడా.. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు. దీంతో పల్లె రవికి ఏదైనా పదవి వస్తుందని అందరూ భావించారు. ఎమ్మెల్సీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ.. ఏ పదవీలోకి ఆయన్ను తీసుకోలేదు.

దీంతో అసంతృప్తితో ఉన్న పల్లె రవికుమార్.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన సతీమణి పల్లె కల్యాణి కాంగ్రెస్ పార్టీ నుంచి చండూరు ఎంపీపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటించడంతో.. మళ్లీ పల్లె రవికుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన బీసీ నేత కావడంతో.. కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా బీసీ నేత కోసం వెతుకులాటలో పడింది.

కాంగ్రెస్ పార్టీలో మొదటి దశలోనే పల్లె రవికుమార్ పేరు పరిశీలనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్, బీజేపీలకు పోటీనిచ్చే సరైన అభ్యర్థి పల్లె రవి అని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. మరో ఆసక్తికరమైన ప్రచారం కూడా జరుగుతోంది. సీఎం కేసీఆర్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థిగా బీసీ నేత వైపే మొగ్గు చూపుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న పల్లె రవిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని.. ఆయన్నే తమ అభ్యర్థిగా బరిలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కీలక నేతకు కేసీఆర్ బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా.. మునుగోడు రాజకీయం రంజుగా మారిందని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here