ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం

0
7
aadhar link with voter card

ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియలో ఆధార్ సమాచారం పూర్తి గోప్యంగా ఉంచబడుతుందని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు అన్నారు.

మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం, ఫోటో ఓటర్ జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియ బూత్ లెవెల్ స్థాయిలో ఇంటింటికి కొనసాగుతుందన్నారు. ఇందుకోసం కొత్తగా ఫారం 6 బి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2303 బూత్ లెవెల్ అధికారులు,231 సూపర్వైజర్ల ద్వారా  ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, అన్ని రాజకీయ పార్టీలు సహాయ సహకారాలు అందించి కార్యక్రమం విజయవంతం అవుటకు తోడ్పడాలన్నారు. ఆధార్ సంఖ్యను తెలియజేయడం పూర్తిగా స్వచ్ఛందమని, ఓటర్ల గుర్తింపును ఏర్పాటు చేయడం, ఓటరు జాబితా లోని ఎంట్రీల ప్రామాణీకరణ కార్యక్రమం లక్ష్యమన్నారు. అలాగే ఓటర్లే నేరుగా ఆన్ లైన్ ద్వారా వారి ఓటర్ కార్డు తో ఆధార్ను అనుసంధానం చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా ఉండటానికి తద్వారా ఎన్నికలలో పోలింగ్ శాతం పెరగడానికి ఉపయోగకరమన్నారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో ఎవరి ఓట్లనూ తొలగించరన్నారు. అదేవిధంగా గతంలో ప్రతి సంవత్సరం జనవరి 1 న మాత్రమే నూతన ఓటర్లుగా నమోదు చేసుకునేoదుకు అవకాశం ఉండేదని, ప్రస్తుతం జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలలో అర్హత గల యువత ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. అదేవిధంగా 18 సంవత్సరాల వయసు నిండకముందే, ఆరు నెలలు ముందుగానే ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. బూత్ లెవల్ అధికారుల ద్వారానే ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, వాలంటీర్లు ప్రమేయం ఎటువంటి పరిస్థితుల్లో ఉండదని స్పష్టం చేశారు.
కావున అందరూ భాగస్వాములై ఆధార్ అనుసంధాన ప్రక్రియ కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

తొలుత ఎన్నికల సంఘం జారీ చేసిన సవరించిన కొత్త ఫారం 6, ఫారం 6 బి, ఫారం 7, ఫారం 8 లను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి ఆవిష్కరించారు.

అదేవిధంగా ఓటర్ కార్డ్ పై ఉన్న ఫోటోను మార్చివేసి కొత్తగా కలర్ ఫోటో ను మార్చుకునేందుకు కూడా అవకాశం ఉందన్నారు. అదేవిధంగా ఫోటో ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో భాగంగా సరైన వసతులు లేని పోలింగ్ స్టేషన్లను ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలలోకి మార్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఆగస్టు 4 నుండి అక్టోబర్ 24 వరకూ పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. నవంబర్ 9 న ఓటర్ల జాబితా సమీకృత డ్రాఫ్టు ప్రచురించటం జరుగుతుందన్నారు. వాటిపై  అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకూ స్వీకరిస్తామన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి హఫీ మాలిక్ , వై ఎస్ ఆర్ కాంగ్రెస్, బిజెపి, టిడిపి తదితర రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here