కాకాని వెంకటరత్నం (1900-1972) స్వాతంత్ర పోరాట సమరయోధుడు. ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యునిగా, మంత్రిగా పనిచేసారు, 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో కీలక నాయకుడిగా పనిచేస్తూ అసువులు బాసారు. తుదిశ్వాస వరకూ జై ఆంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు. ఉక్కు కాకానిగా పేరొందారు.
కాకాని వెంకటరత్నం 1900 సంవత్సరం, ఆగస్టు 3వ తేదీన కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
స్వాతంత్ర పోరాటం
కాకాని వెంకటరత్నం మహాత్మ గాంధీ ఉపదేశాలతో స్పూర్తి పొంది 1924లో రాజకీయ ప్రవేశం చేసి కాంగ్రెస్ పార్టీ తరపున పనిచేశారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని రెండేళ్లు జైలు శిక్ష అనుభవించారు. వీరు 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. 1937-40లలో కృష్ణాజిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 1941-42లో యుద్ధ వ్యతిరేక ప్రచారం చేశారు. వీరు క్విట్ ఇండియా ఉద్యమంలో – క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఫలితంగా 1942-1945 సంవత్సరాల మధ్య వెల్లూరు, తంజావూరు కారాగారాలలో శిక్షను అనుభవించారు.
రాజకీయ జీవితం
1949-53 మధ్య కృష్ణా జిల్లా పరిషత్ అధ్యక్షునిగా పనిచేసారు. 1952-53లో మరియు 1967 లో ఆంధ్రప్రదేశ్ పి.సి.సి అధ్యకులుగా పనిచేశారు.
1955 లో ఆంధ్ర రాష్ట్ర శాసన సభకు జరిగిన తొలి ఎన్నికలలో ఉయ్యూరు నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా శాసన సభకు ఎన్నికైనారు. 1956 లో ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రాలు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, వీరు ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభలో ఆంధ్ర ప్రాంతం తరపున సభ్యులుగా పనిచేసారు. 1962 లో, 1967లో మరల 1972లో ఉయ్యూరు నుండి కాకాని వెంకటరత్నం శాసన సభ్యునిగా ఎన్నికైనారు. 1959-66ల మధ్య వర్కర్స్ యూనియన్ గౌరవ కులు పనిచేశారు.
అటుపిమ్మట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి (1969-71), పి.వి. నరసింహారావు (1971-77) నుండి వర్గాలలో వ్యవసాయ, పశుపోషక, పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు మంత్రిగా సహకార రంగం లో పొడి పరిశ్రమలను నెలకొల్పి పాల విప్లవానికి నాంది పలికారు. వ్యవసాయ పరపతి సంఘాలను ఏర్పాటు చేసారు. జనబాంధవునిగా పేరుపొందారు.
జై ఆంధ్ర ఉద్యమం
1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో వీరు కీలకంగా వ్యవహరించి మంత్రిపదవికి రాజీనామా చేశారు. జై ఆంధ్ర ఉద్యమం లో విధ్యార్దుల పై పోలీసు కాల్పులు జరిగి విద్యార్ధులు మరణించారన్న వార్త విని వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు. ప్రజలు వీరిని “ఉక్కు కాకాని” అని పిలిచేవారు.