కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ భేటీ

0
2
jagan at kappam constituency leader

వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్ కుప్పం అంటున్నారు. 2024 ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలుపు దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇవాళ్టి (ఆగస్టు 4) నుంచి నియోజకవర్గాల వారీగా.. కార్యకర్తలతోనూ సమావేశం అవుతున్నారు. నెలకు 10 నుంచి 15 నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే తొలి సమావేశం గురువారం సాయంత్రం కుప్పం నియోజకవర్గానికి చెందిన 60 మంది కార్యకర్తలతో నిర్వహించారు.

మూడేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి, అందిస్తున్న సుపరిపాలనపై సీఎం జగన్‌ కార్యకర్తల అభిప్రాయాలను తెలుసున్నారు. మూడేళ్లుగా చేసిన మంచిని.. రాబోయే కాలంలో చేయబోయే సంక్షేమాన్ని ఇంటింటికీ వెళ్లి వివరించాలని జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలోనే ముందు కుప్పంను టార్గెట్ చేశారు. ఈసారి ఎలాగైనా అక్కడ వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేయాలని భావిస్తున్నారు. ఈ సమావేశంలో కుప్పం కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూనే.. చంద్రబాబుపై బరిలోకి దిగబోయే అభ్యర్థి భరత్‌కు బంపరాఫర్ ప్రకటించారు.

కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తలతో భేటీలో అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పం తన సొంత నియోజకవర్గంతో సమానమని.. భరత్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పంకు అత్యధికంగా మేలు జరిగింది అన్నారు. కుప్పం మున్సిపాల్టీకి సంబంధించి రూ.65 కోట్ల విలువైన పనులను మంజూరు చేస్తున్నామన్నారు. కుప్పం అభివృద్ధికి అన్ని వేళలా అండగా ఉంటానని.. 175 కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలి అన్నారు.

కుప్పం కంచుకోట ను గత 3 స్థానిక ఎన్నికల్లో పగులగొట్టామని జగన్ తనతో అన్నారని ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ భరత్ అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తతో సీఎం రెండు నిముషాలు మాట్లాడి ఫొటో తీసుకున్నారని.. తన సొంత నియోజకవర్గం పులివెందుల కంటే ఎక్కువగా కుప్పంను అభివృద్ది చేస్తానన్నారని చెప్పుకొచ్చారు.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆదేశించారని.. హంద్రీనీవా కెనాల్ ను సీఎం రమేష్ మూడేళ్లుగా పూర్తి చేయడం లేదని సీఎంకు చెప్పామన్నారు. వేరే వారికి కాంట్రాక్టు ఇచ్చి ఏడాదిలో హంద్రీనీవా పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుకు, టీడీపీకి చెక్ పెట్టాలని పావులు కదుపుతున్నారు జగన్. ఆ దిశగా చిత్తూరు జిల్లా సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తరచూ పర్యటనలు చేస్తున్నారు. అక్కడ యువకుడు కేఆర్జీ భరత్‌ను వైఎస్సార్‌సీపీ బరిలోకి దించింది. ముందు నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి.. ఆ తర్వాత ఏకంగా ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు.

భరత్ కూడా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.. స్థానిక సంస్థల ఎన్నికలు, కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగినా లాభం లేకుండా పోయింది. భరత్ కూడా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉంటే.. అధినేత జగన్ ఏకంగా చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవీ బాధ్యతలు అప్పగించారు. చంద్రబాబుకు, టీడీపీకి ఎక్కువగా పట్టు ఉన్న గ్రామాలపైనా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇలా ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here