కూతురు మాట వినలేదని నేలకేసి కొట్టిన నాన్న

0
4

హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన బాసిత్ అలీఖాన్, ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన సనా ఫాతిమాను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. నలుగురు పిల్లలతో కలిసి ఏసీ గార్డెన్స్ ఏరియాలో వీరు నివాసం ఉంటుండగా.. ప్రస్తుతం అతడి భార్య 8 నెలల గర్భిణి. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించే బాసిత్‌లో ఇటీవల ఆందోళన ఎక్కువైంది. భార్యకు డెలివరీ చేయించడానికి డబ్బులు అవసరం కావడం, కుటుంబ పోషణకు కూడా తన సంపాదనే ఆధారం కావడంతో.. బాసిత్ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలోనే తరచుగా పిల్లలపై చేయి చేసుకునేవాడు.

శనివారం సాయంత్రం బాసిత్ పనికి వెళ్తుండగా.. మూడో కూతురైన సకీనా ఫాతిమా బాత్రూమ్‌లో ఆడుకుంటోంది. బయటకు రమ్మని బాసిత్ చెప్పినప్పటికీ.. తను రాలేదు. దీంతో ఆగ్రహానికి లోనైన బాసిత్.. పాపను కొట్టాడు. భార్య సనా అతణ్ని అడ్డుకునేందుకు రాగా.. పక్కకు తోసేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అప్పటికీ కోపం తగ్గని బాసిత్.. కుమార్తెను నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

సనా స్పృహలోకి వచ్చాక చూడగా.. కూతురు ఇంట్లోనే పడిపోయి ఉంది. కానీ పాప నిద్రపోతోందని భావించిన సనా.. చాలా సేపటి వరకు లేపలేదు. తర్వాత పాలు పట్టడం కోసం లేపేందుకు ప్రయత్నించగా.. లేవలేదు. అప్పటికే పాప శరీరం చల్లబడటంతోపాటు నోట్లో నుంచి నురగలు వస్తుండటంతో ఆందోళనకు గురైన సనా.. పాపను నిలోఫర్ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. డాక్టర్ల సలహా మేరకు అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించారు.

ఆ తర్వాత పాప ఆరోగ్య పరిస్థితి గురించి సనా తన భర్తకు సమాచారం ఇచ్చింది. దీంతో హాస్పిటల్‌కు వచ్చిన బాసిత్.. తను చేసిన తప్పును తలచుకొని కుమిలిపోయాడు. సనా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాసిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి క్షణికావేశం కారణంగా.. ఓ చిన్నారి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా.. మిగతా ముగ్గురు పిల్లలు, కడుపులో బిడ్డతో ఉన్న అతడి భార్య ఇంటి పెద్ద దిక్కు లేకుండా బతుకు బండి లాగాల్సిన పరిస్థితి తలెత్తింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here