కైకాల సత్యనారాయణ తెలుగు సినీ నటుడు, భారత పార్లమెంటు సభ్యుడు. గత 60 సంవత్సరాలుగా తెలుగు సినిమారంగంలో ఉన్న ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసాడు. హాస్య, ప్రతినాయక, నాయక, భూమికలెన్నిటినో పోషించాడు. తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్. వి. రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో ఈయన ఒకరు. 1959 లో సిపాయి కూతురు అనే చిత్రంతో ఈయన సినీరంగప్రవేశం చేశాడు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికినట్లయింది. అతను యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. కృష్ణుడి గా, రాముడిగా యన్.టి.ఆర్ ఎలానో, యముడిగా సత్యనారాయణ అలా! ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలను చాలావరకు సత్యనారాయణ పోషించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు సాంఘికాల్లో రౌడీ, కథానాయకుని తండ్రి, తాత మొదలైనవి.
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి ఇద్దరు దొంగలు కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు సినిమాలు నిర్మించాడు
1996లో అతను రాజకీయాల్లోకి వచ్చి, మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 11వ లోక్సభకు ఎన్నికయ్యాడు.

