ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నాపురం పడమటి కాలువలో కారు కొట్టుకుపోయింది.
పోలవరం ఏజెన్సీలో ఎడతెరిపిలేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏజెన్సీ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరుతుంది. ఏజెన్సీలోని ప్రధాన రహదారులపై కొండ వాగులు పొంగి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నాపురం పడమటి కాలువ వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో కారుతో సహా ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు. తూర్పు కాలువ వద్ద కొండవాగు ఉద్ధృతిలో మరో వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తుల కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. కొండవాగుల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించి ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.