మరణం అనేది ఏ సమయంలో సంభవిస్తుందో తెలియని పరిస్థితి. ఎంతో మంది అనుకోకుండా మృత్యు ఒడిలోకి వెళ్లిన సంఘటనలను చూస్తూనే ఉంటాము. కొందరు అనారోగ్యం కారణంగా మృతి చెందితే.. మరి కొందరు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంటారు. ఇలా అనుకోకుండా కుప్పకూలిపోయి చనిపోయిన వారు ఎక్కువగా గుండెపోటుతోనే మరణించి ఉంటారు. తాజాగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూ మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.
గుజరాత్‌కు చెందిన తుస్సార్ అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లోని సన్‌సిటీ ఎస్బీఐ మైదానంలో తుస్సార్ క్రికెట్ ఆడుతుండగా, ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్థానికులు అతన్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుస్సార్ మరణించాడు. విషయమై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తుస్సార్ గుండెపోటుతో మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.