సీఎం జగన్ దెబ్బకి హడలిపోయిన వైసీపీ ఎమ్మెల్యే
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మొదలుపెట్టని ఎమ్మెల్యేలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల సీరియస్ గానే క్లాస్ తీసుకున్నారు. అందులో నెల్లూరు జిల్లాకు చెందిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి కూడా ఉన్నారని సమాచారం. ఎవరా మహానుభావులంటూ గడప గడపకు ప్రభుత్వం మొదలుపెట్టని ఎమ్మెల్యేలను జగన్ కామెడీ చేశారని, ఆ తర్వాత ఆ కార్యక్రమం విశిష్టత, ప్రాధాన్యం చెప్పి భుజం తట్టారని కూడా అన్నారు. దాంతో అసలు గడప గడప కార్యక్రమాన్ని ఓ భారీ కార్యక్రమంగా చేపట్టేందుకు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సిద్ధమయ్యారు.
జగన్ క్లాస్ ఎఫెక్ట్..
మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులంతా వారి వారి నియోజకవర్గాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారంతా గడప గడప షెడ్యూల్ ని వారం ముందే రెడీ చేసుకుని వాట్సప్ గ్రూపుల్లో పంపిస్తుంటారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రజలకు, స్థానిక నాయకులకు సమాచారం చేరవేస్తుంటారు. కానీ జగన్ క్లాస్ తీసుకున్నారన్న కారణంగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాత్రం ఈ కార్యక్రమాన్ని ఇంకాస్త ఘనంగా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే స్థానిక పత్రికలకు పేపర్ యాడ్స్ ఇచ్చారు. ఆగస్ట్-1 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమం కోసం అన్ని అన్ని ప్రధాన పత్రికల్లోనూ యాడ్స్ ఇచ్చారు. ఆయన కుమారుడు నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి పేరుమీదుగా ఈ ప్రకటననలు జారీ చేశారు. ప్రజాశీస్సులకోసం గడప గడపకు మన ప్రభుత్వం అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి.
20 రోజులకు పూర్తి షెడ్యూల్..
ఆగస్ట్-1 నుంచి ఆగస్ట్ 20వ తేదీ వరకు ప్రతి రోజూ గడప గడప కార్యక్రమం ఉండేలా డిజైన్ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం, ఇందుకూరు పేట, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మొత్తమ్మీద ప్రసన్న కుమార్ రెడ్డిపై జగన్ ప్రభావం బాగా పనిచేసినట్టుంది. అందుకే ఆయన హడావిడిగా పేపర్ యాడ్స్ తో పని మొదలు పెట్టారు.
గతంలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి చురుగ్గా జనాల్లోకి వెళ్లేవారే కానీ, సమీక్షలు, సమావేశాలతో సరిపెట్టేవారు. ప్రత్యేకించి గడప గడపకు అనే పేరుతో ప్రతి ఇంటికి వెళ్లలేదు. కానీ సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేసిన విధంగానే జరపాలని ఆదేశాలిచ్చారు ప్రతి ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లాల్సిందేనంటున్నారు. ఆయా ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకోవాలని, వారికి లభించిన పథకాలను తెలియజేసి, ఏడాదికి ఎవరెవరు ఎంత లబ్ధి పొందారు, ఈ మూడేళ్లలో ఆ కుటుంబం వైసీపీ ప్రభుత్వం ద్వారా ఎంత లబ్ధి పొందింది అనేది చెప్పాలని సూచించారు. కొంతమంది మాత్రమే ఈ ఫార్మాట్ లో వెళ్తున్నారు. మిగతావారు కేవలం ఆయా ప్రాంతాల కూడలిలో సమావేశాలు పెట్టి మమ అనిపిస్తున్నారు. అయితే ఈ వివరాలన్నీ పీకే టీమ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు జగన్.