చిత్ర గా సుపరిచితురాలైన కె. ఎస్. చిత్ర, భారతీయ సినీ రంగములో ప్రసిద్ధ నేపథ్య గాయని. "దక్షిణ భారత నైటింగేల్" అని బిరుదునందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ మొదలైన భాషల సినిమాల్లో సుమారు 25 వేలకు పైగా పాటలు పాడింది. చిత్ర 2005 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2021 లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నది. ఈమె గురువు ఓమనకుట్టి అన్నయ్య అయిన ఎం. జి. రాధాకృష్ణన్ 1979లో ఓ మలయాళ సినిమాలో మొట్టమొదటిసారిగా పాడించాడు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. 1982లో మళ్ళీ ఒక యుగళగీతం పాడే అవకాశం వచ్చింది. మొదట్లో ట్రాక్ కోసమని ఓమనకుట్టి తమ్ముడు శ్రీకుమరన్, చిత్ర కలిసి పాడారు. తర్వాత అసలైన పాట కోసం కె. జె. ఏసుదాసు తో పాటు పాడే అరుదైన అవకాశం దక్కింది. మొదటిసారి తప్పులు పాడినా జేసుదాసు సహకారంతో విజయవంతంగా పాడగలిగింది. దాంతో ఆమెకు మిగతా సంగీత దర్శకులు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆమె గొంతు చిన్నపిల్లలా ఉందని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక మలయాళ సినిమాను దర్శకుడు ఫాజిల్ తమిళంలో కూడా తీద్దామనుకున్నాడు. నటి నదియా కోసం మలయాళంలో చిత్ర పాటలు పాడింది. సంగీత దర్శకుడు ఇళయరాజా ఈమె గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా ఆమెకే అవకాశం ఇచ్చాడు. దీని తర్వాత సింధుభైరవి అనే చిత్రంలో తెలుగులో పి. సుశీల పాడిన నేనొక సింధు అనే పాటను తమిళంలో చిత్ర పాడింది. తర్వాత అదే సినిమాలో పాడలేని పల్లవైన భాషరాని దానను అనే పాటను తమిళ, తెలుగు భాషల్లోనూ చిత్రనే పాడింది. తెలుగు సినిమాల్లో చిత్రకు ఇదే తొలిపాట. ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. దక్షిణాది భాషలు, హిందీలలో ఈమెకున్న పరిచయము వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలదు. అందుకే ఆమె ప్రతి ఒక్క ప్రాంతంలో అభిమానులను సొంతం చేసుకున్నారు. పురస్కారాలు చిత్ర వేలకొద్ది సినిమా పాటలు, సినిమాయేతర పాటలు రికార్డు చేసింది. చిత్ర గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం 2005 లో పద్మశ్రీ, 2021 లో పద్మభూషణ్ పురస్కారాలతో ఆమెను సన్మానించింది. చిత్ర తన గాత్ర జీవితములో ఉత్తమ మహిళా నేపథ్యగాయనిగా ఆరు జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులనందుకొన్నారు. జాతీయ పురస్కారాలు అందుకొన్న సినిమాలు. 1986 - సింధుభైరవి, తమిళ/తెలుగు సినిమా 1987 - నఖక్షతంగళ్, మలయాళ సినిమా 1989 - వైశాలీ, మలయాళ సినిమా 1996 - మిన్సార కనువు, తమిళ సినిమా 1997 - విరాసత్, హిందీ సినిమా 2004 - ఆటోగ్రాఫ్, తమిళ సినిమా ఇవేకాక చిత్ర ఉత్తమ నేపథ్యగాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 16 పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 పురస్కారాలు, తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 4 పురస్కారాలు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పురస్కారాలను అందుకుంది. దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్యగాయక పురస్కారాలందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది. అంతేకాక ఒడిశా ప్రభుత్వం నుండి 1,బెంగాల్ ప్రభత్వం నుండి 1 అందుకున్నారు. 8 ఫిలింఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇవే కాకుండా 252 ఇతర అవార్డ్ లు అందుకున్నారు. మరియు చైనా ప్రభుత్వం నుండి అవార్డ్ పొందిన మొదటి భారత దేశ నేపథ్య గాయకురాలు గా చరిత్ర సృష్టించారు. బ్రిటిష్ పార్లమెంటు లోనూ అరుదైన గౌరవం లభించిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఆమె అందుకున్న అన్ని పురస్కారాల సంఖ్య 452 పై చిలుకు.


