ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం..

0
3
 • ఆగస్టు 15న ప్రజల మధ్య జెండా వందన కార్యక్రమంలో పాల్గొననున్న టిడిపి అధినేత
 • ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రజలతో కలిసి టిడిపి ర్యాలీలు, ప్రత్యేక కార్యక్రమాలు
 • ఎంపి మాధవ్ భాగోతం కంటే జగన్ సమర్థన మరింత నీచంగా ఉంది. గోరంట్ల పై సిఎం చర్యలు తీసుకోవాల్సిందే!
 • పార్టీలో నూతనత్వం, యువతకు ప్రాధాన్యంపై సూచనలకు కమిటీ ఏర్పాటు
 • టిడిపి ప్రత్యేక పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చ, తీర్మానాలు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపట్టిన కార్యక్రమాలను టిడిపి పొలిట్ బ్యూరో స్వాగతించింది.

2023 వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆగస్టు 13,14,15 తేదీల్లో జరిగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.

ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఒక జిల్లా కేంద్రంలో ప్రజల మధ్య జాతీయ జెండా ఎగురవేయనున్నారు.

ఇదే రోజున గ్రామ, మండల,నియోజకవర్గ స్థాయి నుంచి నేతలు అంతా తమ తమ ప్రాంతాల్లో ఘనంగా జెండా పండుగ నిర్వహించనున్నారు.

జాతీయ జెండాలతో ప్రజలతో కలిసి బైక్ ర్యాలీలు చేసి… యువతలో స్వాంతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చెయ్యాలని నిర్ణయించారు.

స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలు అర్పించిన వారి గాథలను ప్రజల్లో తీసుకు వెళ్లి యువతలో దేశభక్తి పెంచేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఆయా ప్రాంతాలలో స్వాంతంత్ర్య సమరయోధులను సత్కరించనన్నారు.

ఈ రోజు ప్రత్యేకంగా జరిగిన టిడిపి పొలిట్ బ్యూరో సమావేశంలో వీటితో పాటు పలు అంశాలపై చర్చించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పై తాను పాల్గొన్న నేషనల్ కమిటీ సమావేశం వివరాలను చంద్రబాబు పొలిట్ బ్యూరో సభ్యులకు వివరించారు.

దేశ భక్తిని పెంపొందించేలా కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.

పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించిన ఇతర అంశాలు, తీర్మానాలు:

 1. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పొలిట్ బ్యూరో సమావేశం తీర్మానించింది. ప్రతి తెలుగుదేశం కార్యకర్త, నాయకుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని, అన్ని చోట్లా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
 2. చట్టసభ సభ్యుడిగా ఉండి వైసిపి ఎంపి గోరంట్ల మాధవ్ చేసిన పనిని పొలిట్ బ్యూరో తీవ్రంగా తప్పుపట్టింది. డర్టీ జె గ్యాంగ్ వల్ల మహిళా భద్రత ప్రమాదంలో పడింది. వైసిపి డర్టీ పిక్చర్ రాష్ట్రానికే అవమానం అని…. గోరంట్ల మాధవ్ చట్ట సభల్లో, రాజకీయాల్లో ఉండటానికి అనర్హుడని తక్షణమే అతన్ని భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఎంపి మాధవ్ చేసిన పనికంటే ఆ పనికి జగన్ రెడ్డి సమర్థన మరింత నీచంగా ఉంది. మాధవ్ నగ్న వీడియో వ్యవహారం ప్రైవేటు వ్యవహారం అని వైసిపి మాట్లాడటం సిగ్గుమాలిన చర్య అని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. తమ పార్టీ నేత చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వైసిపి అధిష్టానం కులాల మద్య విషం చిమ్మే ప్రయత్నాన్ని చెయ్యడాన్ని పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. అలాగే టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను ఈ రోజు జరిగిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఉండగానే వైసిపి రౌడీలు ఫోన్ చేసి బెదిరించడాన్ని సమావేశం ఖండించింది.
 3. గోదావరి వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. బాధితులకు పునరావాసం ఇవ్వడంతో పాటు కనీస సాయం చెయ్యడంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. వరద బాధితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల సమయంలో నాటి తెలుగు దేశం ప్రభుత్వం ఇచ్చిన సాయాన్ని మించి సాయం చెయ్యాలని సమావేశం డిమాండ్ చేసింది. పెరిగిన ధరలు, ఖర్చులు, వరదల తీవ్రత కారణంగా పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిన నిధులు రూ.6,250 కోట్లు కేంద్రం రీయింబర్స్ చేశారు. అయినా ముంపు బాధితులకు జగన్ రెడ్డి హామీ ఇచ్చిన విధంగా ఆర్ అండ్ ఆర్ పరిహారం రూ.10 లక్షలు, సేకరించిన భూమికి రూ.5 లక్షలు ఎందుకు ఇవ్వలేదని పొలిట్ బ్యూరో ప్రశ్నించింది. మరోవైపు టమాటా పంటకు మద్దతు ధర లేక రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నా జగన్ రెడ్డి ఆదుకోవడం లేదు. మూడేళ్ల తర్వాత జగన్ రెడ్డికి పంటలకు గిట్టుబాటు ధర, భూసార పరీక్షలు గుర్తుకురావడం విడ్డూరంగా ఉంది. రైతులకు ధాన్యం బకాయిలపై ప్రభుత్వ వైఖరిని సమావేశం ఖండించింది. రాష్ట్రంలో ధరల పెరుగదల తో సామాన్యులు పడుతున్న బాధలు దారుణంగా ఉన్నాయని…ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే పేదలు మరింత కష్టాలు పడుతున్నారని సమావేశం అభిప్రాయ పడింది. పన్నుల రూపంలో బాదుడుకు ప్రజలు అల్లాడిపోతున్నారని సమావేశం అభిప్రాయ పడింది.
 4. పాఠశాలల విలీనం…. లక్షలాది మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యావకాశాల్ని దూరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చెయ్యాలని సమావేశం నిర్ణయించింది.
 5. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సంస్కరణలు తీసుకురావడంతో పాటు యువతకు భాగస్వామ్యంపై పొలిట్ బ్యూరో లో చర్చ జరిగింది. ఈ అంశంపై పొలిట్ బ్యూరో సభ్యులు పలు సూచనలు చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యంపై స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీలో నూతనత్వం, యువరక్తం తీసుకువచ్చేందుకు కసరత్తు వేగవంతం చెయ్యాలని చెప్పారు. దీంతో ఈ అంశాలపై సమగ్రంగా స్టడీ చేసి నివేదిక ఇచ్చేందుకు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది.
 6. కామన్వెల్త్ క్రీడల్లో 22 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య.. మొత్తం 61 పతకాలు సాధించి దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టిన విజేతలైన క్రీడాకారులను పొలిట్ బ్యూరో అభినందించింది. గతంలో టీడీపీ ప్రభుత్వం జాతీయ క్రీడలు, ఆఫ్రో-ఏషియన్ గేమ్స్ నిర్వహించి, క్రీడా వసతులు కల్పించి, క్రీడాకారులకు ప్రోత్సహకాలు అందించిన విషయం చర్చకు వచ్చింది.
 7. తెలుగుదనానికి నిండుదనంగా, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించేందుకు నిత్యం పని చేసిన శ్రీ వెంకయ్యనాయుడు గారు ఉప రాష్ట్రపతిగా పదవీ కాలం పూర్తి చేసిన సందర్భంగా వారి సేవలను పొలిట్ బ్యూరో కొనియాడింది. తెలుగు వ్యక్తి సాగించిన అపూర్వ ప్రస్థానంపై పొలిట్ బ్యూరో అభినందనలు తెలిపింది.
 8. బీసీ జనగణన చేయాలని, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని పొలిట్ బ్యూరో తీర్మానించింది. వీటితో పాటు గోదావరి వరదల్లో బాధితులకు సాయం చేసిన దాతలు, పార్టీ నేతలు, ఎన్టీఆర్ ట్రస్ట్ ను సమావేశం అభినందించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here