జగన్ అక్రమాస్తుల కేసులో బహ్మానందరెడ్డిపై విచారణ తప్పదు
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన వాన్‌పిక్ ప్రాజెక్టు కేసులో ఆరో నిందితుడైన మాజీ ఐఆర్ఏఎస్ అధికారి కె.వీ.బ్రహ్మానందరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
- ఆయనపై విచారణను నిలిపేయలేమని, ప్రాథమిక దశలోనే ఆయనను కేసు నుంచి తప్పించలేమని కోర్టు పేర్కొంది.
- రికార్డుల్లో ఉన్న ఆధారాలతో శిక్ష పడుతుందా లేదా అన్నది విచారణ చివర్లో తేలుతుందని పేర్కొంది.
- విచారణకు తగినంత సమాచారం ఉందని అభిప్రాయపడింది.
- అందువల్ల సీబీఐ కోర్టు 2016 ఆగస్టులో వెలువరించిన తీర్పును తప్పుపట్టలేమంటూ బ్రహ్మానందరెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ 53 పేజీల తీర్పును హైకోర్టు వెలువరించింది.
సీబీఐ కోర్టు తనపై కేసును కొట్టివేయడానికి నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మాజీ అధికారి బ్రహ్మానందరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ చేపట్టిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇటీవల తీర్పు వెలువరించారు.
బ్రహ్మానందరెడ్డిపై విచారణను నిలిపేయలేమని, ప్రాథమిక దశలోనే ఆయనను కేసు నుంచి తప్పించలేమన్నారు.
ఇరుపక్షాల వాదనలతోపాటు.. పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ తెలంగాణ హైకోర్టు సీజే తీర్పు వెలువరించారు.
కింది కోర్టు విచారణలో భాగంగా అభియోగాల నమోదు సమయంలో నిందితుడితోపాటు ప్రాసిక్యూషన్ వాదనలు వింటారని, నిందితుడిపై అనుమానాల తీవ్రత ఎక్కువగా ఉంటే విచారణ ప్రక్రియ కొనసాగుతుందని చెబుతూ దీనిపై సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ప్రస్తావించారు.
నిందితుడిని కేసు నుంచి డిశ్చార్జి చేయడం, హైకోర్టు జోక్యం తదితర అంశాలను సుదీర్ఘంగా చర్చించారు.
సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలోని అంశాలు, సీబీఐ కోర్టు తీర్పులోని అంశాలను పేర్కొంటూ బ్రహ్మానందరెడ్డిపై విచారణ ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పారు.
ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్న నేపథ్యంలో సీబీఐ కోర్టు ఆయన పిటిషన్‌ను కొట్టేసిందని, ఆ తీర్పును తాము తప్పు పట్టలేమని పేర్కొన్నారు.
ఇదీ నేపథ్యం
ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉపాధి కల్పన నిమిత్తం చేపట్టిన వాడరేవు, నిజాంపట్నం పోర్టు ఆధారిత పారిశ్రామికవాడ- వాన్‌పిక్ పేరుతో చేపట్టిన ప్రాజెక్టు అమలుకు ఏపీ ప్రభుత్వం, రస్ అల్ ఖైమా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
ఇందులో భాగంగా భారతీయ భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మాట్రిక్స్ ఎన్‌పోర్టు హోల్డింగ్స్‌ను రంగంలోకి దిగింది.
ప్రాజెక్టు నిమిత్తం గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 12,973 ఎకరాలను కేటాయించింది.
వాన్‌పిక్ పోర్ట్సు ప్రాజెక్టు పేరుతో సొంత వాటా అధికంగా ఉన్న వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు భూకేటాయింపులు, రాయితీలు కల్పించారని సీబీఐ ఆరోపించింది.
అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపులు చేయడంతోపాటు ప్రాజెక్టులో రాక్ వాటా తగ్గింపు సహా అన్నీ జరిగాయని ఆరోపించింది.
నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపులు, కొనుగోళ్లు జరిగాయని, రాక్ నుంచి ప్రాజెక్టు నిమిత్తం వచ్చిన నిధులను మళ్లించారని ఆరోపించింది.
వాన్‌పిక్ ప్రాజెక్టుతో ప్రయోజనాలు కల్పించినందుకు ప్రతిఫలంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో నిమ్మగడ్డ ప్రసాద్ 854 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని ఆరోపించింది.