జగన్ సర్కార్‌పై మండిపడ్డ అశ్వినీ దత్..

0
9

జగన్ పై చినజీయర్‌ మాటలు వినగానే కడుపు మండింది: అశ్వినీదత్‌ సీరియస్

జగన్ సర్కార్‌, చిన జీయర్ స్వామిలపై సినీ నిర్మాత అశ్వినీ దత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరగని పాపమంటూ లేదని.. మూడేళ్ల జగన్‌ పాలనలో అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని విమర్శించారు. తిరుపతి పరపతి దిగజారిందని.. ఇన్ని జరుగుతున్నా ఆ స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియడం లేదన్నారు. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని.. ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందన్నారు. సీతారామం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చినజీయర్‌ స్వామి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారని.. ఆగమశాస్త్రం ప్రకారమే చంద్రబాబు ఆ మండపాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మతమార్పిడులు జరుగుతున్నా చిన జీయర్‌ స్వామి ఎందుకు స్పందించలేదన్నారు. హిమాలయాల్లో కూలింగ్ గ్లాసులు పెట్టుకుని.. 150 కిలోమీటర్ల స్పీడులో కారు నడిపిన వ్యక్తి… స్వామిజీనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చిన జీయర్ స్వామి ఓ స్థూపం ఆవిష్కరణ సందర్భంగా జగన్‌ని కలియుగ దైవమంటూ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ మాటలు వినగానే తన కడుపు మండిపోయింది అన్నారు. సమ్మక్క-సారక్క అంటే ప్రజల్లో ఎంతో విశ్వాసమని.. పొరుగు రాష్ట్రాల ప్రజలూ సమ్మక్క-సారక్కను దేవతలుగా నమ్ముతారన్నారు. వారిని ఆయన దేవతలు కాదనడం బాధ కలిగించింది అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here