టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కడలి జయసారథి(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని సిటీ న్యూరో హాస్పిటల్ లో నెల రోజులుగా చికిత్స తీసుకుంటూ సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సారథి దాదాలు 372 చిత్రాల్లో నటించి మెప్పించారు. 1961లో వచ్చిన ‘సీతారామ కళ్యాణం’ సినిమాతో తన కెరీర్ ని ప్రారంభించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ సినిమాలో కథానాయకుడిగా నటించారు. ఆ సినిమా హిట్ అవ్వడంతో తన కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1976 లో వచ్చిన ‘భక్త కన్నప్ప’, 1978 లో వచ్చిన ‘జగన్మోహిని’ చిత్రాలు ఆయనకి విశేషమైన కీర్తిని ఇచ్చాయి. జగన్మోహిని సినిమాలో దెయ్యంతో కలిసి ఆయన చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఆ సన్నివేశంలో సారథి నవ్వు ఒక సిగ్నేచర్ మార్క్ గా నిలిచిపోయింది.
తెలుగు సినిమా ఇండస్ట్రి మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేశారు. సారథి ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరించారు. 1942 జూన్ 26 న ఆంధ్రప్రదేశ్ లోని పెనుగొండలో జన్మించారు. అల్లు రామలింగయ్య, రేలంగి, రాజబాబు వంటి హాస్య నటులతో పాటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ‘భలే రంగడు’, ‘అగ్గి వీరుడు’, ‘మంచి మనసులు’, ‘భక్త కన్నప్ప’, ‘ఎదురీత’, ‘అమర దీపం’, ‘ఆలుమగలు’, ‘జగన్మోహిని’, ‘మనవూరి పాండవులు’, ‘డ్రైవర్ రాముడు’ వంటి హిట్ సినిమాల్లో ఆయన నటించారు. 90 వ దశకంలో ఆయన నటనకి స్వస్తి పలికి కృష్ణం రాజుతో కలిసి ఇంటింటి రామాయణం, జమిందారిగారి అమ్మాయి వంటి సినిమాలకు సాంకేతిక సహకారాలు అందించారు. రెబల్ స్టార్ కృష్ణం రాజుతో ఆయనకి ప్రత్యేక అనుబంధం ఉంది. ధర్మాత్ముడు, అగ్గిరాజు, విధాత వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. చివరిగా సుమన్ హీరోగా నటించిన ‘హలో అల్లుడు’ సినిమాలో డాక్టర్ పాత్ర పోషించారు. జయ సారథి అంత్యక్రియలు మధ్యాహ్నం 2 గంటలకి మహాప్రస్థానంలో జరగనున్నాయి.