తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతాం

0
2
central minister shikavat

యాదాద్రి: తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నిజమైన నివాళి ఇవ్వాలంటే కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.యాదగిరిగుట్టలోని వంగపల్లి నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభలో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.మొదట తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన షెకావత్‌.. ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని, తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా పేర్కొన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బండి సంజయ్‌ ఆధ్వర్యంలో తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తుందన్నారు. అణగారిన కులాలంటే కేసీఆర్‌కు గిట్టదన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, ఆ ప్రాజెక్టు కేసీఆర్‌కు డబ్బు సంపాదించే మిషన్‌ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి పరులను జైల్లో వేసేందుకు భాజపాకు అధికారం ఇవ్వాలన్నారు. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతామని షెకావత్‌ స్పష్టం చేశారు.భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం తర్వాతే సీఎంగా ప్రమాణ స్వీకారంనల్గొండ జిల్లాలో భాజపా ఎక్కడుందని అనేవాళ్లకు తామేంటో చూపించామని, ఖమ్మంలో కూడా నిరూపిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట నుంచి మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో బండి సంజయ్‌ మాట్లాడారు. భాజపా అధికారంలోకి వచ్చాక భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాకే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి భాజపా కార్యకర్త ఉగ్రనరసింహ అవతారం ఎత్తి కేసీఆర్‌ సర్కారును పారద్రోలాలని పిలుపునిచ్చారు.”రజాకార్లను తరిమికొట్టిన గడ్డ నల్గొండ. నల్గొండ గడ్డకు శక్తి ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన కుటుంబం గజ గజ వణికిపోతోంది. బుక్కెడు బువ్వ కోసం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు, గురుకుల పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్‌ కుటుంబానికి నిజాయితీ ఉంటే ట్రిపుల్‌ ఐటీ, గురుకుల పాఠశాలల్లో భోజనం చేయాలి. తెలంగాణలో ఏమీ చేయని కేసీఆర్‌ దిల్లీ రాజకీయ సమీకరణాలు మారుస్తానంటున్నారు. రైతుల రుణమాఫీ చేయకుండా నట్టేట ముంచారు. దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు ఎంతమందికి వచ్చింది. ఉచితంగా యూరియా ఇస్తానని కేసీఆర్‌ చెప్పారు. ఒక్కరికైనా.. ఉచితంగా యూరియా ఇచ్చారా. వాసాలమర్రికి వంద హామీలు ఇచ్చారు.. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. చేనేత బీమా ఇస్తామని ఏడాది క్రితం ప్రకటించారు. ఎంతమందికి చేనేత బీమా ఇచ్చారో కేసీఆర్‌ స్పష్టం చేయాలి. చేనేత బీమా ఇచ్చే వరకు భాజపా ఊరుకోదు. క్యాసినో వ్యవహారం వెనుక తెరాస నాయకుల హస్తం ఉంది. నయీమ్‌ డైరీ, స్వాధీనం చేసుకున్న రూ.వేల కోట్లు ఎక్కడికి పోయాయో సీఎం కేసీఆర్‌ చెప్పాలి. తప్పకుండా కేసీఆర్‌ దోచుకున్న సొమ్మును రికవరీ చేస్తాం. తెలంగాణ కోసం ఉవ్వెత్తున ఉద్యమించిన యువత భాజపా కోసం పని చేయాలి. అన్ని సర్వేలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయి” అని బండి సంజయ్‌ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here