తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బీమా..

0
3

నేతన్నలకు రూ.5 లక్షల బీమా పథకం.. 7న ప్రారంభం

రైతు బీమా తరహాలో నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బీమా పథకాన్ని ప్రారంభించబోతోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న నేతన్నకు బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కె తారక రామారావు వెల్లడించారు. ఎవరైనా నేత కార్మికుడు దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా పరిహారం అందిస్తారు. నామినీ బ్యాంక్ ఖాతాలో 10 రోజుల్లో ఈ మొత్తం జమ అవుతుందని కేటీఆర్ తెలిపారు.

రైతు బీమా తరహాలో నేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమం ప్రారంభించబోతోంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న ‘నేతన్న బీమా పథకం’ ప్రారంభిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్లర తారక రామారావు తెలిపారు. నేతన్నల కోసం ఈ విధమైన పథకాన్ని ప్రవేశపెట్టడం దేశంలో ఇదే తొలిసారి అని ఆయన వెల్లడించారు. రైతు బీమా మాదిరిగానే నేతన్నలకు ఈ పథకం కింద బీమాను వర్తింపజేస్తామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 80,000 మంది నేత కార్మికులకు లబ్ధి చేకూరనుందని కేటీఆర్ తెలిపారు.

60 ఏళ్లలోపు వయసున్న ప్రతి నేత కార్మికుడు ఈ పథకానికి అర్హులు. ఎవరైనా నేత కార్మికుడు దురదృష్టవశాత్తు మరణిస్తే.. ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా పరిహారం అందించనున్నారు. చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు నేతన్న బీమా పథకం దోహదపడుతుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

నేతన్న మరణిస్తే.. నామినీ ఖాతాలో పది రోజుల వ్యవధిలో రూ.5 లక్షలు జమ అవుతుందని కేటీఆర్ వెల్లడించారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఎవరైనా చనిపోతే, వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారని మంత్రి వివరించారు. పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని తెలిపారు.

నేతన్న బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాతో (LIC) తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని కేటీఆర్ తెలిపారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందని తెలిపారు. ఇందుకోసం రూ.50 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని కేటీఆర్ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here