దండయాత్ర కోసమే China సైనిక విన్యాసాలు.. 

0
6

తైవాన్ ద్వీపాన్ని తమ భూభాగమేనంటూ పదే పదే వాదిస్తున్న చైనా.. దానిని కలిపేసుకోడానికి ఇటీవల కాలంలో ప్రయత్నాలను వేగవంతం చేసింది. అవకాశం కోసం ఎదురుచూస్తున్న డ్రాగన్‌కు.. అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన రూపంలో వెదకాల్సిన తీగ కాలికే తగిలినట్టయ్యింది. దీంతో రెచ్చిపోతున్న చైనా.. సైనిక విన్యాసాలను మొదలుపెట్టింది. ఇప్పటి వరకూ యుద్ధ విమానాలను తైవాన్ గగనతలంలోకి పంపి కవ్వింపు చర్యలకే పరిమితమైన చైనా.. తాజాగా డ్రిల్స్ నిర్వహిస్తూ భయపెడుతోంది.

గతవారం అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన.. చైనా అహాన్ని దెబ్బతీసింది. తైవాన్‌లో పెలోసీ కాలుపెడితే అమెరికా మూల్యం చెల్లించుకోకతప్పదని ముందే హెచ్చరికలు పంపింది. తైవాన్‌ సందర్శిస్తానని పెలోసీ ప్రకటించిన సమయంలో నాలుగు రోజుల భారీ సైనిక విన్యాసాలను డ్రాగన్‌ ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్టు ఆదివారంతో సైనిక విన్యాసాలు ముగుస్తాయని అందరూ భావించారు. కానీ, దీనికి విరుద్దంగా తమ సైనిక విన్యాసాలు ఆగవని చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ సోమవారం స్పష్టం చేసింది. తైవాన్‌ లక్ష్యంగా ఇవి కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించిన సీపీఎల్ఏ.. ఎప్పుడు వరకూ అనే విషయంపై స్పష్టత ఇచ్చేందుకు నిరాకరించింది.

మరోవైపు, దండయాత్రకు సైనిక విన్యాసాలతో చైనా సిద్ధమవుతోందని తైవాన్ విదేశాంగ మంత్రి మంగళవారం ఆరోపించారు. ‘‘ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేలా ద్వీపాన్ని ఆక్రమించేందుకు సముద్ర, గగనతల విన్యాసాలను ఉపయోగిస్తూ దండయాత్రకు సిద్ధవుతోంది’’ అని తైవాన్ మంత్రి జోసెఫ్ వూ ప్రకటించారు.

‘‘భారీ మొత్తంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది.. క్షిపణులను ప్రయోగిస్తోంది.. దీంతో పాటు సైబర్ దాడులు నిర్వహిస్తూ తైవాన్‌లో ప్రజల మనోధైర్యం, ఆర్థిక స్థితిని దెబ్బతీసేందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది’’ అని మండిపడ్డారు. చైనా సోమవారం కొనసాగించిన సైనిక విన్యాసాలను ఖండిస్తున్నట్లు పునరుద్ఘాటించారు. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్, విమాన మార్గాలలో ఒకదానిని అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.

తమ ద్వీపంపై దాడులు చేస్తే తిప్పికొట్టేలా తైవాన్ సైన్యం స్వయంగా లైవ్-ఫైర్ డ్రిల్‌ ను నిర్వహించిన కొద్ది సేపటికే మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చైనా యుద్ధ క్రీడలు తైవాన్ హక్కుల స్థూల ఉల్లంఘనగా పేర్కొన్నారు. తైవాన్, ఆసియా-పసిఫిక్ ప్రాంతం చుట్టూ ఉన్న విస్తృత జలాలపై నియంత్రణ సాధించే ప్రయత్నమని ధ్వజమెత్తారు. ‘‘చైనా అసలు ఉద్దేశం తైవాన్ జలసంధి.. మొత్తం ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చడమే’’ అని దుయ్యబట్టారు.

ఇదే సమయంలో తమకు మద్దతుగా నిలుస్తున్న పశ్చిమ దేశాలకు కూటమికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. వారి మద్దతు ‘‘నిరంకుశత్వ బెదిరింపులకు ప్రజాస్వామ్యం తలొగ్గదని ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని కూడా పంపింది’’ అని ఉద్ఘాటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here