కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2022 లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మనఊరు-మనబడి కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం దాతల సహకారం కోరిన సంగతి కూడా తెలిసిందే.
ప్రభుత్వ ఆలోచనకు స్పందించి ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె, సినీనటి మంచు లక్ష్మి ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి, డీఈవో ఇతర శాఖల అధికారులతో మంచు లక్ష్మి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దత్తత తీసుకున్న పాఠశాలల్లో మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాస్ లు నిర్వహిస్తామని తెలిపారు.ఇందులో భాగంగా ఆలేరు మండలం పటేల్ గూడెం ప్రభుత్వ పాఠశాలను ఆమె సందర్శించారు.