నార్మల్ డెలివరీ చేసే డాక్టర్లకు రూ.3000

0
11

ప్రైవేట్ వైద్యులు కాసుల కోసమే సిజేరియన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాస్తో కూస్తో జరిగే ఆ నార్మల్ డెలివరీలు కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే నమోదవుతున్నాయి. వీటిని మరింత ప్రోత్సహించే చర్యలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నార్మల్ డెలివరీ చేసే డాక్టర్లకు రూ.3 వేల నగదు ప్రోత్సాహాన్ని ప్రకటించింది. దీనిపై వైద్యులు, మహిళలతో పాటు వివిధ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది.ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద బాలింతలకు శిశువుకు అవసమైన వస్తూత్పత్తులతో కూడిన కిట్‌తో పాటు రూ.13000 నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తున్నారు. ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగినట్లు గణాంకాలు కూడా చెబుతున్నాయి. తాజాగా ఈ దిశగా డాక్టర్లకు ప్రోత్సాహం ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం కీలకంగా మారనుంది.

ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు చేసిన వైద్య బృందానికి రూ.3 వేల ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. సాధారణ ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు ఈ విధానం దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

సహజ ప్రసవాల వల్ల తల్లికి, శిశువుకు క్షేమం జరుగుతుందని సర్వేలు చెబుతున్నాయి. మొదటి గంటలో తల్లి పాలు అందుతాయని, ఆరు నెలల పాటు పాలు అందడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఉంటుందని వెల్లడిస్తున్నాయి. శిశు మరణాల రేటు కూడా 22 శాతం తగ్గించవచ్చని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు, సహజ ప్రసవాలపై అవగాహన కల్పించేందుకు పలువురు మహిళా అధికారులు, ఐఏఎస్ అధికారులు కూడా ప్రసవాల కోసం గవర్నమెంట్ ఆస్పత్రుల్లో అడ్మిట్ అవుతున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here