కంగ్రాట్స్ నీరజ్ చోప్రా, నీ విజయంపై ‘దేశం’ గర్విస్తోంది – అభినందనల వెల్లువ
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ నుంచి పతకం సాధించిన రెండో అథ్లెట్ నీరజ్ చోప్రా విజయంపై దేశం గర్విస్తోంది. ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా.. అమెరికాలోని యూజీన్‌లో ఆదివారం ఉదయం జరిగిన జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచి, రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 88.13 మీటర్ల దూరం జావెలిన్ విసిరి సిల్వర్ మెడల్ సాధించి భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.
‘నీరజ్ చోప్రాకు అభినందనలు. వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో చారిత్రక మెడల్ సాధించావు. భారత క్రీడలకు ఇది వన్నె తెచ్చే సందర్భం. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని’ నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విశ్వ వేదికపై అత్యుత్తమ ప్రదర్శనతో సిల్వర్ మెడల్ సాధించిన భారత అథ్లెట్ నీరజ్ చోప్రాను నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జి కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ సహా పలువురు నేతలు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు.