కాపుల ఓట్లు మూటగట్టి హోల్‌సేల్‌గా.. పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ సీరియస్ కామెంట్స్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. కాపు ఓట్లను మూటగట్టి చంద్రబాబుకు హోల్‌సేల్‌గా అమ్మేందుకు దత్తపుత్రుడు ప్రయత్నిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు సభలో సీఎం పాల్గొన్నారు. తనకు దత్తపత్రుడి అండదండలు లేవని.. అనుకూల మీడియా లేదని.. కేవలం ప్రజల దీవెనలే ఉన్నాయన్నారు. డీబీటీ అంటే.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డీబీటీ ద్వారా అవినీతికి తావులేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధుల్ని.. లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు.
చంద్రబాబు పాలనలో డీపీటీ అంటే.. దోచుకో, పంచుకో, తినుకో అని సెటైర్లు పేల్చారు. డీపీటీ ద్వారా దుష్టచతుష్టయం అంతా కలిసి సామాజిక న్యాయం పాటించారని.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాకు తోడు వారి దత్తపుత్రుడు కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచుకొని పంచుకున్నారని ధ్వజమెత్తారు. వీరికి తెలిసిన సామాజిక, ఆర్ధిక, రాజకీయ న్యాయం అదే అన్నారు. సంక్షేమ పథకాలన్నీ రద్దు చేయాలని టీడీపీ అంటోందని.. ఆయన అనుకూల మీడియా మాత్రం రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని సంక్షేమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోందన్నారు.