పేదల వ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే పాలకులకు తగిన బుద్ధి చెబుతాం

0
2

గ్రామీణ పేదల సమస్యలు పరిష్కరించకపోతే మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘాల అధ్యక్షులు సయ్యద్ మౌలాలి, నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు ఆర్.వెంకట్రావు , కం కణాల .ఆంజనేయులు మాట్లాడుతూ పేదల వ్యతిరేక విధానాల అనుసరిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై గ్రామీణ పేదలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. నేడు దేశవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద తమ సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ పేదలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారనీ, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పేదల సమస్యలు పరిష్కరించకుంటే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఒక వైపున మోడీ ప్రభుత్వం దేశ స్వాతంత్రానికి 75 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఆజాది అమృత ఉత్సవం పేరుతో కోట్లాది రూపాయలు ప్రచారానికి ఖర్చు చేసుకుంటుందని, మరోవైపు 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఉండటానికి ఇల్లు లేక, చేయటానికి పని లేక, తినడానికి తిండి లేక, విద్య వైద్యం లాంటి కనీస సౌకర్యాలు అందుబాటులో లేక కోట్ల మంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మరోవైపు ఈ పాలకుల విధానాల వల్ల వ్యవసాయ కార్మికులు కూడా ఆత్మహత్యలకు పాల్పడాల్సిన దుస్థితి దాపురించిందని అన్నారు. అనేక పోరాటాలతో పేదలు కొన్ని హక్కులు, చట్టాలు సాధించుకున్నారని మోడీ ప్రభుత్వం వాటన్నిటిని సంపన్నులకు సానుకూలంగా మారుస్తుందని అన్నారు. ఒకే దేశం, ఒకే రేషన్ అనే పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీనపరచడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమైందని అన్నారు. ఒక వైపు 14 రకాల నిత్యవసర వస్తువులు పేదలకు అందించి ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయమని ప్రజలు కోరుతుంటే ఆహార భద్రతకు భంగం కలిగేలా కేంద్రం వ్యవహరిస్తుందని వారు అన్నారు. కేంద్ర ప్రభుత్వ గోడౌన్లలో కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పందికొక్కుల పాలవుతుంటే పేద ప్రజలకు పంచడానికి మోడీ ప్రభుత్వానికి చేతులు రాకపోవడం దుర్మార్గమని అన్నారు. ఆదివాసీ మహిళలను రాష్ట్రపతిని చేశామని సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెబుతూ ఆ ఆదివాసీల హక్కులు, చట్టాలన్నీ నిర్వీర్యం చేసే చర్యలకు మోడీ ప్రభుత్వం పాల్పడుతుందని అన్నారు. అటవీ ప్రాంతాల్లో ఉన్న మైనింగ్, బొగ్గు అటవీ సంపదనంతా ప్రైవేటు వ్యక్తులకు ధారాధత్తం చేయటానికి అటవీ సంరక్షణ చట్టాలను మోడీ ప్రభుత్వం సవరించిందని అన్నారు. గిరిజనులకు అండగా ఉన్న అటవీ భూముల 1/ 70 చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, సీలింగ్ భూముల చట్టాన్ని విస్మరించిందని, పేదల చేతుల్లోని భూములు పెత్తందారులు కాజేయకుండా నిలువరించటానికి ఏర్పాటు చేసిన 9/77 చట్టానికి తూట్లు పొడుస్తున్నదని ఈ విధంగా పేదలకు ఆసరాగా ఉన్న చట్టాలు ఒక్కొక్కటి బలహీనం చేసి పేదల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందని వారు విమర్శించారు. గ్రామీణ పేదలకు కొంత ఆసరాగా ఉన్న ఉపాధి హామీ చట్టానికి నిధులు తగ్గించి నిర్వీర్యం చేసే చర్యలకు మోడీ ప్రభుత్వం సిద్ధమైందని ఈపాటికే రెండు పూటలా పనిని, సాఫ్ట్వేర్ లో మార్పులతో అనేక రాష్ట్రాల్లో కూలీలను పనికి దూరం చేశారని అన్నారు. దేశంలో 75 ఏళ్ల స్వాతంత్ర్య అనంతరం కూడా ఆకలి చావులు, ఆత్మహత్యలు, నిరుద్యోగం, పేదరికం, సామాజిక వివక్షతలాంటి సమస్యలు పరిష్కారం కాకపోగా, తీవ్ర రూపం దాల్చడం సిగ్గుచేటని వారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలను తిప్పికొట్టేందుకు ఆగస్టు ఒకటి నుండి 15 వరకు దేశవ్యాప్తంగా గ్రామీణ పేదలంతా కలిసి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వ దుష్ట విధానాలను తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here