పోలవరంపై సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు…

0
15

ముఖ్యమంత్రి వైఎస్ జగన్  గోదావరి వరద బాధితుల్ని రెండో రోజు పరామర్శిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కొయుగురు గ్రామంలో వరద బాధితులతో జగన్‌ ముఖాముఖి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం నిర్వాసితుల పరిహారం విషయంలో కేంద్రంతో యుద్ధాలు, కుస్తీ పడుతూనే ఉన్నామని.. కేంద్రం చెల్లించకుంటే రాష్ట్రం తరపునే సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5లక్షలు ఇస్తామని.. ఆతర్వాతే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.

సహాయం అందరికీ అందాలనే తాపత్రయం.. గతంలో కన్నా పరిస్థితిలో ఎంతో మారిందన్నారు ముఖ్యమంత్రి. పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించామని.. అందరికీ రేషన్‌, ఇంటింటికీ రూ. 2 వేలు ఇచ్చామన్నారు. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చామన్నారు. ఎవరికి, ఎలాంటి వరద నష్టం జరిగినా సరే.. గ్రామ సచివాలయంలో లిస్ట్‌లో ఉంటుందని తెలిపారు. నష్టం వివరాలు ఏమైనా ఉంటే పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అర్హత ఉన్న అందరికీ రెండు నెలల్లోగా పరిహారం అందుతుందని.. ఎగ్గొట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదన్నారు. తాటాకు గుడిసెల నిర్వాసితులకు పరిహారం రూ. ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

కేంద్రం నుంచి నిధులు రాకపోతే నీళ్లయినా నింపకుండా చూస్తాను అన్నారు సీఎం. అవసరమైతే పరిహారం సొంతంగా ఇస్తానని.. వచ్చే సెప్టెంబర్ కల్లా 41.5 అడుగుల వరకూ ఉన్న బాధితులకు పరిహారం పూర్తి చేస్తాను అన్నారు. రూ.వెయ్యి రెండు వేల కోట్లు అయితే తానే ఇచ్చేవాడినని.. రూ20వేల కోట్లకు కేంద్రం సహాయం తప్ప గత్యంతరం లేదన్నారు. వరదలతో నష్టపోయిన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, ప్రతీ ఒక్కరికీ పరిహారం అంది తీరుతుందన్నారు జగన్. వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకున్నామని.. చింతూరులో నాలుగు మండలాల్లో కలెక్టర్‌ 20 రోజుల పాటు ఉన్నారని చెప్పారు. కలెక్టర్‌, అధికారులు, వలంటీర్లు.. ఇక్కడే ఉండి పరిస్థితి సమీక్షించడం అభినందనీయమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here