సూక్ష్మ, చిన్న, మద్యతరహా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ కార్పొరేషన్ ప్రధానకార్యదర్శి చిరంజీవి చౌదరి తెలిపారు. ఆహార ఉత్పత్తుల పెంపుదలపై అనుబంధ శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ద్వారా ఆహార ఉత్పత్తులు ప్రజలకు మరింతగా అందుబాటులోకి వస్తాయని చిరంజీవి చౌదరి చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తులు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం రాయితీలపై బ్యాంకుల ద్వారా రుణసదుపాయం కల్పిస్తుందన్నారు. పొదుపు మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులను మరింత వృద్ధి చేయడానికి అధికారులు సమగ్ర ప్రణాళికను రూపొందించాన్నారు. బాపట్ల జిల్లాలో లభ్యమయ్యే జీడిపప్పు, సముద్ర ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేస్తే ఉత్పత్తిదారులకు మరింత ప్రయోజనం ఉంటుందన్నారు. అలాగే ప్రజలకు ఆహార ఉత్పత్తులు చౌకధరకే అందుబాటులోకి వస్తాయన్నారు. మత్స్య సంపదకు మంచి ధర వచ్చేలా ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించేలా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ప్రతిరోజు 72 లక్షల లీటర్ల పాల ఉత్పత్తులు లభ్యమౌతున్నాయన్నారు. కేవలం 22 లక్షల లీటర్లు మాత్రమే ప్రజల అవసరాలకు వినియోగిస్తున్నారని, మిగిలిన 50 లక్షల లీటర్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయని తెలిపారు. పాల ఉత్పత్తుల అనుబంధంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పరిశ్రమల స్థాపించే ఔత్సాహికులకు బ్యాంకులు రుణసదుపాయం కల్పించాలన్నారు. పలు అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు.
ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ ఏ.డి జెన్నెమ్మ, వ్యవసాయ శాఖ జె.డి అబ్దుల్ సత్తార్, మత్స్య శాఖ జె.డి సురేష్, ఎల్.డి.ఎమ్ డి.ప్రేమకుమార్, పరిశ్రమల శాఖ జి.ఎం మదన్ మోహన్, పశుసంవర్థక శాఖ జె.డి హనుమంతరావు, డి.ఆర్.డి.ఏ పి.డి సత్యసాయి, తదితరులు పాల్గొన్నారు.