బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

0
12

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనకు తోడు అల్పపీడనం ఏర్పడటంతో రుతుపవనాలు మరింత చురుకుగా మారాయి. దీంతో వచ్చే రెండు రోజుల ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లొదని హెచ్చరించింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో శనివారం సాయంత్రం అల్పపీడనం ఏర్పడింది.

ఇది సోమవారం కల్లా బలపడి పశ్చిమంగా పయనించనుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో ఒకటిరెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీసే సూచనలు ఉన్నాయని చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

బంగాళాఖాతంలో రుతుపవన కరెంట్ బలంగా ఉండటం వల్ల ఉత్తర కోస్తాలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55, కొన్నిసార్లు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావారణ కేంద్రం హెచ్చరించింది. అటు, రుతుపవనాలు చురుగ్గా మారడంతో కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో శనివారం అక్కడక్కడా వర్షాలు కురిశాయి.

శనివారం అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 12 సెం.మీ, ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో 11 సెం.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా సుబ్బులులో 93 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్‌, అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, పల్నాడు, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి.

శనివారం కోస్తా, రాయలసీమల్లో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అటు ఇటుగా నమోదయ్యాయి. తిరుపతిలో అత్యధికంగా 34.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here