జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు హెచ్చరించారు.
గురువారం సాయంత్రం కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ హాస్టళ్లలో బాలికలపై లైంగిక వేధింపులు అరికట్టుట, హాస్టళ్లలో చేపట్టాల్సిన రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హాస్టళ్లలో బాలికల సంరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన విధంగా రోజువారీ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ హాస్టళ్లలో ఈ పోస్టర్లను విధిగా ప్రదర్శించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి రమాదేవి, జడ్పీ సీఈవో వాణి, బీసీ వెల్ఫేర్ అధికారి వెంకటయ్య, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి పరిమళ, డిపిఓ ధనలక్ష్మి, డ్వామా పిడి తిరుపతయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.