బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..

0
10

బ్రహ్మదేవుడు కూడా టీఆర్ఎస్ పార్టీని కాపాడలేడు: ఈటల రాజేందర్

మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ ను గజ్వేల్ నియోజకవర్గంలో ఓడగొట్టడమే తన ముందున్న లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీజేపీ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని వెల్లడించారు. తాము చెప్పేది టీఆర్ఎస్ పార్టీకి అబద్ధంగా అనిపిస్తే.. వారే చూస్తారని అన్నారు. అన్ని స్థాయిల్లో చేరికలు ఉంటాయని, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు.

 తెలంగాణ బీజేపీ జాయినింగ్ కమిటీ కన్వీనర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీని ఇక బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ అనుసరించే విధానాలే అందుకు కారణమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇకనుంచి ప్రజలకున్న ఏకైక పార్టీ బీజేపీనే అని వివరించారు. భవిష్యత్తులో బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తెలంగాణ లో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే అని స్పష్టం చేశారు.

ఇప్పటికే తనతో అనేక మంది టీఆర్ఎస్ నేతలు, ఇతర పార్టీల నాయకులు మాట్లాడుతున్నారని ఈటల రాజేందర్ చెప్పారు. టీఆర్ఎస్, ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. కొందరికి కొన్ని సమస్యలు ఉన్నాయని.. అవి పరిష్కారం కాగానే.. కేసీఆర్ పార్టీకి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా టైం ఉంది కదా అని కొంతమంది వెయిట్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇంకా కొంతమంది కాంట్రాక్ట్ పనులు చేశారని వారు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.

కేవలం ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలే కాకుండా.. మండల స్థాయి నుంచి కూడా తనకు ఫోన్లు చేస్తున్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు. అనేక మంది ఎంపీటీసీలు, సర్పంచిలు, జట్పీటీసీలు, మండలస్థాయి నాయకులు బీజేపీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారని ఈటల వెల్లడించారు. ఇలా అనేకమంది పార్టీలు మారడానికి కారణం బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరగడమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనతో ప్రజలే కాదు.. నాయకులు కూడా విసిగిపోయారని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

తాను కచ్చితంగా కేసీఆర్ ను ఓడిస్తానని ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేశారు. గజ్వేల్ లో కేసీఆర్ పై తాను పోటీ చేస్తానంటే.. టీఆర్ఎస్ నేతలు ముందు హుజురాబాద్ లో గెలవమని అంటున్నారని ఈటల చెప్పారు. హుజురాబాద్ లో అయినా సరే.. తనపై కేసీఆర్ గానీ.. హరీశ్ రావు గానీ పోటీ చేసి గెలవాలని ఈటల మరో సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నేతలు భయంతోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారం, పార్టీ, హోదా, డబ్బు ఇవి ఏవీ శాశ్వతం కాదని కేసీఆర్ కు తెలిసేలా చేస్తామని చెప్పారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మనుషులు కాదు.. సిస్టం శాశ్వతం అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంత దారుణంగా హక్కులను హరించలేదని ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసి.. 9 నెలలు దాటిందని.. ఈ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదని వివరించారు. ఏమన్నా అభివృద్ధి జరిగితే.. అది కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతోందని చెప్పారు. ఉప ఎన్నిక ముందు వచ్చి హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ పోయారని ఈటల ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here