బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత…

0
7

భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నగరంలోని మూసారాంబాగ్‌ వద్ద బ్రిడ్జిని ఆనుకుని మూసీ నది ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్‌ పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.పురాతన బ్రిడ్జి కావడంతో ప్రమాదం జరిగే అవకాశముంటుందని భావించి రాకపోకలు నిలిపివేశారు. ఇవాళ రాత్రికి బ్రిడ్జిపైకి వరదనీరు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. మూసీ నది వరద ఉద్ధృతి పెరిగితే చాదర్‌ఘాట్‌లో లెవెల్‌ బ్రిడ్జిపై ట్రాఫిక్‌ నిలిపివేస్తామని జీహెచ్‌ఎంసీ మలక్‌పేట సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ జయంత్‌ వెల్లడించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించాలి: మేయర్‌ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ 040-21111111కు సంప్రదించాలని మేయర్‌ సూచించారు. కంట్రోల్‌ రూమ్‌ 24 గంటల పాటు పనిచేస్తుందని తెలిపారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిస్థితులను పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మూసీ వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జోనల్‌ కమిషనర్లు, డీసీలు, వాటర్‌ వర్క్స్‌, విద్యుత్‌ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, మాన్సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌లు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here