భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఇవాళ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం (ఆగస్టు 11) మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, పార్లమెంటు సభ్యులు హాజరుకానున్నారు. ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో భారత 14వ ఉపరాష్ట్రపతిగా జగ్దీప్ ధన్కర్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థి జగదీప్ ధన్కర్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష అభ్యర్థి మార్గరెట్ అల్వాపై జగదీప్ ధన్కర్ 346 ఓట్ల భారీ తేడాతో విజయం సాధించారు. మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లు ఆయనకు పోలయ్యాయి. విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు కేవలం 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
జగదీప్ ధన్కర్.. ప్రస్థానం..
సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన జగదీప్ ధన్కర్ భారత కొత్త ఉపరాష్ట్రపతిగా ఈ రోజు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి ముందు పశ్చిమ బంగాల్ గవర్నర్‌గా పనిచేసిన 71 ఏళ్ల ధన్కర్.. ఎం వెంకయ్యనాయుడి స్థానంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వహింబోతున్నారు. జగదీప్ ధన్కర్ స్వస్థలం రాజస్థాన్‌లోని కితానా గ్రామం. గోకల్‌చంద్, కేసరి దేవి దంపతులకు మే 18, 1951న జన్మించారు. ప్రాథమిక విద్యను కితానా గ్రామంలో, ఉన్నత విద్యను చితోర్ఘర్ సైనిక స్కూళ్లో చదివారు. రాజస్థాన్ యూనివర్సీటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. సుదేశ్ ధన్కర్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమార్తే ఉన్నారు. ధన్కర్ రాజకీయాలతో పాటు లాయర్‌గా, క్రీడాకారుడిగానూ రాణించారు. గతంలో సుప్రీంకోర్టు అడ్వొకేట్‌గా పనిచేశారు.
కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా..
జగ్దీప్ ధన్కర్. సట్లెజ్ నదీజలాల వివాదంలో హర్యానా ప్రభుత్వం తరపున వాదించి ఫేమస్ అయ్యారు. 1989-91 మధ్య జున్జున్ నియోజకవర్గం నుంచి జనతాదళ్ పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు. రాజస్థాన్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యరు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజస్థాన్‌లోని కిషన్‌గంజ్ నుంచి 1993-98 మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1990లో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. లోక్‌సభతో పాటు రాజస్థాన్ అసెంబ్లీలో వివిధ కమిటీలో పనిచేశారు. క్రీడలంటే కూడా ఆయనకు చాలా ఆసక్తి. రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్, రాజస్థాన్ టెన్నీస్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి బెంగాల్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.