పార్టీ సీనియర్ నేత రాజీనామా, సంచలన వ్యాఖ్యలు
నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మంగళగిరిలో కీలక నేత గంజి చిరంజీవి పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని జాయిన్ అయ్యానని.. నేతి బీరకాయలో నెయ్యి ఉండదనేది ఎంత నిజమో తెలుగుదేశం పార్టీలో బీసీలకు చోటు ఉండదనేది అంతే నిజమన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేశానని.. పార్టీలో కొంతమంది నాయకులు తనను రాజకీయంగా హత్య చేశారన్నారు. అందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటారని.. కాని మంగళగిరి నియోజకవర్గం చేనేతలకు సంబంధించిన నియోజకవర్గం అన్నారు. ఆ ఒక్క సీటు కూడా లాగేసుకున్నారు మాకు ద్రోహం చేశారని.. లోకేష్ కోసమే ఒక పథకం ప్రకారం బీసీ సామాజికవర్గానికి చెందిన తనను పక్కకు నెట్టారన్నారు. పార్టీని తాను మోసం చేస్తే.. తాను నమ్ముకున్న దేవుడు తనను నాశనం చేస్తాడన్నారు. తెలుగుదేశం పార్టీ తనను మోసం చేస్తే అదే దేవుడు తెలుగుదేశం పార్టీని నాశనం చేస్తారన్నారు. 2019 చివరి వరకు సీటు నీదే అని సీట్లు ఇవ్వకుండా తీవ్రంగా అవమానించారన్నారు.