–సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్
నెల్లూరు రొట్టెల పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోందని, ఏటి కేడాది భక్తుల సంఖ్య పెరగడం దర్గా ప్రాశస్త్యాన్ని చాటి చెబుతోందని సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. రొట్టెల పండుగను పురస్కరించుకుని బారా షహీద్ దర్గాలో జరుగుతున్న ఏర్పాట్లను నగర పాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ శ్రీమతి డి.హరిత లతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అనంతరం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో దర్గాలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో విలేకరులతో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన ఉధృతి వలన గత రెండేళ్లుగా పండుగ నిర్వహించలేకపోయామని, ఈసారి పండుగకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఎం.డి.ఖలీల్ అహ్మద్,వివిధ డివిజనుల ప్రజా ప్రతినిధులు, వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.