దేశంలో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. భారత్‌లో పెరిగిపోయిన నిరుద్యోగం, ధరలపై కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతోన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు.
దేశంలో ప్రజాస్వామ్యం లేదని, నలుగురు వ్యక్తుల నిరంకుశత్వమే ఉందని చెప్పారు. 100 ఏళ్ళుగా అంచెలంచెలుగా భారత్ నిర్మించుకుంటూ వస్తోన్న వ్యవస్థలు ఇప్పుడు మన కళ్ళముందే నాశనం అవుతున్నాయని ఆరోపించారు.
ఎన్డీఏ నిరంకుశత్వ విధానాలకు వ్యతిరేకంగా నిలుస్తోన్న వారు ఎవరైనా సరే.. వారిపై దారుణంగా దాడులు చేస్తున్నారని, అరెస్టు చేసి జైల్లో పెట్టి కొడుతున్నారని ఆయన చెప్పారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సమాజంలో హింస వంటి వాటి గురించి ఎవరూ నిలదీయకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని ఆయన విమర్శించారు. ఇద్దరు, ముగ్గరు బడా వ్యాపారుల ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం పరిచేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ఎదుర్కోవడంపై రాహుల్‌ను మీడియా ప్రశ్నించగా.. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అడ్డుకుంటోన్న తనపై దాడులు చేస్తున్నారని, తనపై ఎన్ని దాడులు చేసినకొద్దీ మరింత దీటుగా పనిచేస్తున్నానని అన్నారు. ప్రశ్నిస్తోన్న వారికి కేంద్ర ప్రభుత్వం ఎంతగా భయపెట్టినా నిష్ప్రయోజనమేనని ఆయన చెప్పారు. కాగా, కాంగ్రెస్ నేతలు నేడు నిరసన ప్రదర్శనలకు దిగుతోన్న నేపథ్యంలో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నాయి.