మునుగోడుపై చంద్రబాబు ఫోకస్..TDP మద్దతు ఎవరికీ…?

0
5

Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

  • తెలంగాణలో రాజకీయాలు మొత్తం మునుగోడు నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్, టీఆర్ఎస్ సరైన అభ్యర్థి కోసం కుస్తీ పడుతున్నాయి. అసలు ఉపఎన్నిక షెడ్యూల్ రాకముందే పోటీకి దిగబోయేది ఎవరు?.. ఎవరెవరి సత్తా ఏంటి?.. అంటూ అంచనాలు వేసుకుంటున్నారు. మూడు పార్టీల మధ్య ఆధిపత్య పోరులా మారిన మునుగోడు ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైఖరి చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు టీఆర్ఎస్‌ పార్టీలోని క్షేత్రస్థాయి నాయకుల్లో సింహభాగం టీడీపీ నుంచి వెళ్లిన నేతలే ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలపై టీడీపీ వైఖరి ఏంటన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
  • ఇటీవల గోదావరి వరదలు పోటెత్తిన నేపథ్యంలో భద్రాచలంలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తన పర్యటనకు లభించిన ప్రజాదరణను చూసి మురిసిపోయిన చంద్రబాబు.. తెలంగాణలో టీడీపీ పుంజుకుంటోందని, మళ్లీ యాక్టివ్ రోల్ పోషిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలను బట్టి చంద్రబాబు తిరిగి తెలంగాణపై ఫోకస్ పెట్టనున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణలో పొలిటికల్ పార్టీలకు కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
  • 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడులో టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడంతో క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మద్దతుగా పనిచేశాయి. రాజగోపాల్‌రెడ్డి విజయం వెనుక టీడీపీ కృషి కూడా ఉందని నియోజకవర్గ టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ ఎవరికి మద్దతిస్తుందనేది ఆసక్తిగా మారింది. టీడీపీ నుంచి బయటకు వచ్చి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు మీద తన అభిమానాన్ని అప్పుడప్పుడూ బయటపెడుతూనే ఉంటారు. దీంతో రేవంత్‌రెడ్డి కోరితే చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశముందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
  • మరోవైపు ఇటీవల కాలంలో టీఆర్ఎస్‌ కూడా టీడీపీపై మనసు పారేసుకుంటోందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ శత జయంతి రోజున తెలంగాణ మంత్రులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ టీడీపీకి క్షేత్రస్థాయిలో బలమైన కేడర్ ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల పోటీని తట్టుకుని సత్తుపల్లి, అశ్వారావుపేట స్థానాలను టీడీపీ గెలుచుకుంది. తదనంతరం పరిస్థితుల్లో వారిద్దరు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలమైన కేడర్ చెక్కుచెదరకుండా ఉంది. దీంతో టీడీపీ మద్దతు కూడగట్టుకుంటే ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెరుగైన స్థానాలు దక్కించుకోవచ్చని టీఆర్ఎస్ ఆలోచనగా తెలుస్తోంది. ఏది ఏమైనా మునుగోడు ఉపఎన్నికల్లో టీడీపీ ఎవరికైనా మద్దతిస్తుందా? లేక తటస్తంగా ఉంటుందా? అన్నది కీలకంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here