ముస్లింల తరఫు లాయర్ మృతి..

0
7

అయోధ్య వివాదం తర్వాత దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది వారణాసిలోని జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదం. మసీదు ప్రాంగణంలో ఉన్న హిందూ దేవతా విగ్రహాలకు నిత్యం పూజలు చేసేలా అనుమతించాలని కోరుతూ ఐదుగురు మహిళలు కోర్టుకు వెళ్లడమే ఈ వివాదానికి కారణం. చిన్న వివాదంగా మొదలైన ఈ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. మసీదు ప్రాంగణంలోని వీడియో సర్వేకు కోర్టు అనుమతించగా.. ముస్లిం వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రస్తుతం ఈ కేసు అలహాాబాద్ హైకోర్టులో ఉంది.

వారణాసిలోని జ్ఞాన‌వాపి మ‌సీదు వివాదంపై ముస్లింల తరఫున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది అభయ్ నాథ్ యాదవ్ హఠాన్మరణం చెందారు. ఆదివారం రాత్రి గుండెపోటుతో ఆయన మృతిచెందారు. గుండెపోటుకు గురైన అభయ్ నాథ్‌ను చికిత్స కోసం వారణాసిలోని మక్బుల్ ఆలమ్ రోడ్డులోని త్రిమూర్తి ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించగా అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు. జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫున లాయర్ అభయ్ నాథ్ వాదనలు వినిపిస్తున్నారు.

జ్ఞాన‌వాపి మ‌సీదు ప్రాంగణంలోని హిందూ దేవతల విగ్రహాలు వివాదం కేసులో అభయ్ నాథ్ యాదవ్ ఆగస్టు 4లోపు కోర్టులో ముస్లింల తరఫున వాదన వినిపించాల్సి ఉండగా.. ఆయన ఆకస్మికంగా మరణించారు. ప్రస్తుతం ఈ కేసును అలహాబాద్ హైకోర్టు విచారిస్తున్న నేపథ్యంలో అక్టోబరులో విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. జ్ఞానవాపీ, శృంగార్ గౌరి కేసుల్లో మెయింటెనబిలిటీ (వినడం, వినకపోవడం) అంశంపై అన్ని పక్షాలూ ఇప్పటికే తమ వాదనలు ముగించాయి. కాగా, సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించడంపై బెనారస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిత్యానందరాయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాయర్ అభయ్ నాథ్ యాదవ్ ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురయ్యారని చెప్పారు.

జ్ఞ‌ానవాపి మసీదు వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాలతో జిల్లా న్యాయస్థానం విచారణను మే నెలలో చేపట్టింది. అయితే, మసీదు ప్రాంగణంలో వీడియో సర్వేను వ్యతిరేకిస్తూ ముస్లిం పక్షాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో స్థానిక కోర్టు నుంచి జిల్లా కోర్టుకు కేసు బదిలీ చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు.. సీనియర్, అనుభవజ్ఞ‌ుడైన జడ్జ్‌తో విచారణ చేపట్టాలని సూచించింది. తర్వాత ఇది అలహాబాద్ హైకోర్టుకు చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here